ఒకప్పుడు రజనీకాంత్ తో సినిమాలు చేసే అవకాశం సీనియర్ డైరెక్టర్లకు మాత్రమే ఉండేది. యంగ్ డైరెక్టర్లకు ఆయనకి కథ వినిపించే అవకాశం కూడా దక్కేది కాదు. ఆయనతో సినిమా చేసే అవకాశం రావడానికి చాలా ఏళ్లు ఎదురుచూస్తూ ఉండవలసి వచ్చేది. కానీ మారుతున్న ట్రెండ్ కి తగినట్టుగా రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ తరం డైరెక్టర్లు ఈ తరం ఆడియన్స్ కి ఏం కావాలనేది తెలుస్తుంది. తనని కొత్తగా చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో రజనీ యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
రజనీ అనుకున్నట్టుగానే ఆయనను కొత్తగా చూపించడంలో యువ దర్శకులు సక్సెస్ అయ్యారు. ఆయన స్టైల్ కి తగిన కథలను .. పాత్రలను డిజైన్ చేసుకుంటూనే కొత్తదనాన్ని ఆవిష్కరించారు. ‘కబాలి’కి ముందు కనిపించిన రజనీ వేరు .. ఆ తరువాత కనిపిస్తూ వస్తున్న రజనీ వేరు. అలా ఆయన కేవలం మూడు .. నాలుగు సినిమాలు చేసిన ‘నెల్సన్’ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ సంచలనాన్ని సృష్టించింది. కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ పరంగా ఈ సినిమా ఆడియన్స్ ను కట్టిపడేసింది. బాక్సాఫీస్ బద్ధకాన్ని తీర్చేసింది.
ఈ నెల 10వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. ఈ నెల 16వ తేదీతో, అంటే వారం రోజుల్లో ఈ సినిమా 375 కోట్లకి పైగా వసూలు చేసింది. 17వ తేదీ నుంచి 20వ తేదీ లోగా ఈ సినిమా మరో 25 కోట్లు సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వారంలోను అటు కోలీవుడ్ లో .. ఇటు టాలీవుడ్ లో చెప్పుకోదగిన సినిమాలేం లేవు. అందువలన ‘జైలర్’ జోరుకి ఈ వారం కూడా అడ్డుకట్టపడే ఛాన్స్ లేదు. కనుక ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది సౌత్ లో జెండా ఎగరేసిన సినిమాల జాబితాలో ‘జైలర్’ కూడా చేరిపోయాడు