Sunday, January 19, 2025
Homeసినిమాఅదే జమున గొప్పతనం!

అదే జమున గొప్పతనం!

తెలుగు తెరపై దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన హంపీ శిల్పంలా జమున కనిపిస్తారు. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన జమున, వెండి తెరపై పడుచు పాలరాతి శిల్పంలా మెరిశారు. నాజూకుదనానికి నమూనా అని అందరూ చెప్పుకునేలా చేశారు. విశాలమైన కళ్లతో ఆమె పలికించిన హావభావాలకు అభిమానులంతా దాసోహమన్నారు. జమున కెరియర్ గురించి చెప్పుకోడానికి ఒక పేజీ సరిపోదు .. ఒక పుస్తకమే రాయవలసి ఉంటుంది.

అమాయకత్వం .. ఆత్మాభిమానం .. అహంభావం కలిగిన పాత్రలలో జమున ఇమిడిపోయిన తీరు చూస్తే, ఆమెను గురించి ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నది అర్థమవుతుంది. ఆనాటి అగ్రహీరోలు జమునను పక్కనే పెట్టడానికి ట్రై చేసినా, కంగారుపడిపోయి ఇతర భాషా చిత్రాల వైపు ఆమె పరిగెత్తలేదు. ఆ తరువాత వరుసలో ఉన్న హీరోలతో ముందుకు వెళ్లి, ఆ హీరోల క్రేజ్ పెరగడానికి కారణమయ్యారు.

ఇక సావిత్రితో జమునకి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. నిజమైన అక్కా చెల్లెళ్లకంటే కూడా ఎక్కువ ఆప్యాయంగా ఉండేవారు. సావిత్రికి ఎప్పటికప్పుడు ఊరట కలిగిస్తూ వెళ్లిన నటిగా జమున కనిపిస్తారు. సావిత్రికి మంచి వైద్యం అందేలా చేయడానికి పరితపించినవారిలో జమున ముందుంటారు. ఇక ఎస్వీఆర్ ను సావిత్రితో పాటు జమున కూడా ‘నాన్న’ అనే పిలిచేవారు. ఆల్కహాల్ కారణంగా ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఎస్వీఆర్ ను ఒక కూతురిలా జమున బ్రతిమలాడిన ఘటన వారి మధ్య జరిగింది.

అప్పట్లో ఒక హీరో తాగుడికి బానిస అవుతుంటే మంచి చెప్పి చూసినవారమే. ఆ హీరో వినిపించుకోకపోతే, ఆయన జోడీగా చేయనని చెప్పిన తీరు కూడా జమునలో కనిపిస్తుంది. జీవితాన్ని పద్ధతిగా మలచుకున్న జమున, ప్రతి ఒక్కరి మనసులోను పవిత్రమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. భౌతికంగా జమున లేకపోయినా ఆమె పాత్రలు పలకరిస్తూనే ఉంటాయి .. మధురమైన ఆ స్వర్ణయుగంలోకి మౌనంగా తీసుకుని వెళుతూనే ఉంటాయి.

Also Read :

ఆ నాటి అందాల అభినేత్రి జమున!

RELATED ARTICLES

Most Popular

న్యూస్