రాజానగరం, రాజోలు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం ప్రకటించాల్సి వచ్చిందని, టిడిపి ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటుందని అనుకుంటున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ తన ప్రసంగంలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావించారు. తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని విస్మరించి తమను సంప్రదించకుండానే మండపేటలో అభ్యర్ధిని ప్రకటించిందని ఆక్షేపించారు. చంద్రబాబుకు ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందన్నారు. పొత్తు ఉన్నప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉంటాయన్నారు. జగన్ ప్రభుత్వాన్ని దించాలన్న లక్ష్యంతోనే తాను మౌనంగా ఉన్నానని, పొత్తు విచ్ఛిన్నం కావాలంటే ఎంత సేపు అంటూ ప్రశ్నించారు. పొత్తు ధర్మంలో భాగంగా దాన్ని ప్రకటించకుండా ఉండాల్సింది అంటూ పవన్ అన్నారు.
“పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు. లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు. మనం ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను, పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు.. టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన-టిడిపి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీనిలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది – ఒక మాట తక్కువ ఉంటుంది, అల్టిమేట్ గా మనందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో మేము రెండు సీట్లు ప్రకటిస్తాం.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది” అని పవన్ వ్యాఖ్యానించారు.