రాష్ట్రంలో వాలంటీర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, వెలుగులోకి వస్తున్న నేరాలు కొన్నే ఉన్నాయని, రానివి ఇంకా చాలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో వాలంటీర్ చేతితో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ అసలు ఈ వ్యవస్థ ఏర్పాటు రాజ్యంగ విరుద్ధమని, వీరిని నియమించేటప్పుడు కనీసం పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయించలేదని మండిపడ్డారు. తాజాగా నర్సీపట్నంలో కూడా వాలంటీర్లు చేసిన దారుణాలు బైటపడుతున్నాయని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో బాలికల ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని కైలాస్ సత్యార్ది తనతో చెప్పారని పవన్ అన్నారు. ఒకప్పుడు విశాఖలో క్రైమ్ రేట్ తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అన్నారు. 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు.
వరలక్ష్మి కేసులో వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసులను పవన్ అభినందించారు. బంగారం కోసమే ఈ హత్యకు పాల్పడ్డారని, వైసీపీ నేతలు ఈ కుటుంబాన్ని ఇంతవరకూ పరామర్శించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. తన పర్యటనలపై అంక్షలు విధించే పోలీసులు, కానీ తప్పులు చేసిన వారికి ఎలాంటి అంక్షలు లేవా అని ప్రశ్నించారు. విశాఖలో ఎంపి కుటుంబానికే రక్షణ లేదని, పైగా తన ఇంట్లో జరిగిన సంఘటనపై ఎంపి నిందితులను సమర్ధించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రానికి తెలియజేస్తామన్నారు.