జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎల్లుండి ప్రారంభం కానుంది. నిన్న విజయవాడ చేరుకున్న పవన్ నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ…. ప్రజా క్షేమం… సామాజిక పరివర్తన, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పవన్ ఈ యాగం చేపట్టారని జనసేన ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.
యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టించారు. స్థిరత్వం, స్థిత ప్రజ్ఞత ప్రసాదించే గణపతి; శతృత్వ నిరోధిత దేవత చండీమాత; అష్టైశ్వరాలు ప్రసాదించే శివపార్వతులు; ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు; ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహా విష్ణువులను యాగ పీఠంపై అధిష్టించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందని వెల్లడించారు.
ఎటువంటి ఆర్భాటం, హడావుడి లేకుండా కేవలం ఋత్వికులు మాత్రమే పాల్గొని ఈ యాగం నిర్వహిస్తున్నారు. పవన్ సంప్రదాయ బద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి యాగంలో పాల్గొన్నారు.