ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని, ఏ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని, అయితే ఆయా పార్టీలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో నేడు వైఎస్ షర్మిల నాయకత్వంలో ‘వైఎస్సార్ టీపీ’ ఆవిర్భావం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ ఈ సమాధానం చెప్పారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూనే వారసత్వ రాజకీయాలు తనకు చేతకావని అన్నారు.
తెలంగాణా రాజకీయాలపై తనకు ప్రజారాజ్యం సమయం నుంచే ఓ స్పష్టమైన అవగాహన ఉందని, అయితే ఆ రాష్ట్రంలో కూడా పార్టీని పూర్తి స్థాయిలో నడపగలిగే ఆర్ధిక వనరులు లేవని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ తో పాటు పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన జనసైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేశారు.