అఖిలాంధ్ర ప్రజల మద్దతు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఎంతమంది వచ్చినా సిఎం జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి ఏమీ కాదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన లక్ష్యాలు, విధానాలు ఉంటాయని, వాటి సాధన కోసం ప్రజా క్షేత్రంలో ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నం చేయాలని, అంతేకానీ గందరగోళం సృష్టించేలా వ్యవహరించడం పవన్ కళ్యాణ్ కు తగదని స్పీకర్ అన్నారు. అయోమయ రాజకీయాలకు జనసేన పార్టీ అడ్రెస్ గా నిలిచిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలపై అవాకులు, చెవాకులు మాట్లాడటం తగదన్నారు. విమర్శలు అనేవి ప్రభుత్వ విధానాలపై ఉండాలికానీ, వ్యక్తులు పైన కాదని హితవు పలికారు. టిడిపికి మేలు చేకూర్చేందుకే పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళంలోని రహదారులు, భవనాల శాఖ అతిథిగృహంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మెట్రోపాలిటిన్ నగరాలకు దీటుగా ఉన్న విశాఖపట్నం ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఉండాల్సిందన్నారు. దీని వలన వనరులు సృష్టిoచేoదుకు అవకాశాలు కలిగి ఉండేవన్నారు. ఒకే చోట సంపద, శ్రమ, మేధస్సు, విజ్ఞానం వంటివి వికేంద్రీకృతమై, అభివృద్ధి చెందితే వేర్పాటువాద శక్తులు విజృంభించక తప్పదని జోస్యం చెప్పారు. వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం విపక్షాలకు తగదన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించే వారిని ఉత్తరాంధ్ర పాలిట ద్రోహులుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. వీరికి, ఉత్తరాంధ్ర ప్రజానీకం ప్రజాక్షేత్రంలోనే తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఆయన హెచ్చరించారు.
Also Read : మీకు బాధ్యత లేదా? తమ్మినేని ప్రశ్న