నలభై మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న నేతలు కనీసం ముగ్గురి పేర్లు చెప్పాలని రాష్ట్ర విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పటినుంచో చూస్తున్నామని, అనవసర మాటలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి వైసిపి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే దోపిడీదారులందరూ భయపడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయంలో రాష్ట్ర సర్వనాశనం అయిందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు సంజయ్ కుమార్, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
నిన్న విశాఖ వచ్చిన చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ ను తిట్టడానికే సరిపోయింది తప్ప ఉత్తరాంధ్ర అభివృద్దిపై ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని బొత్స అన్నారు. జనసేన ఒక రాజకీయ పార్టీ కాదని, సెలెబ్రెటీ పార్టీ అని మరోసారి మండిపడ్డారు. అలాంటి వారు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు అందిస్తున్నామన్నారు. నాలుగేళ్ళుగా తాము చేసిన సంక్షేమం వివరించడానికి గృహ సారథులు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఇంటింటికీ వెళుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కోటి 80లక్షల కుటుంబాలను వారు కలుస్తారని బొత్స వివరించారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే అది జగన్ తోనే సాధ్యమన్న విషయాన్ని కూడా ప్రజలకు స్పష్టంగా చెబుతామన్నారు. జగన్ నమ్మకానికి మారుపేరుగా నిలిచారని, ఆయన ఏదైనా చెబితే చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందన్నారు బొత్స.
Also Read : Tirupathi IIT: జూన్ నాటికి క్యాంపస్ సిద్ధం