గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశమైందని, కానీ గుర్తింపు లేని జనసేన పార్టీని ఎలా అనుమతించారని, ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి తెలియజేశారు. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లను విజయసాయి,ఎంపి మార్గాని భరత్, వైసీపీ నేతలు కలుసుకున్నారు. ఆ తర్వాత విజయసాయి మీడియాతో మాట్లాడారు. జనసేనను బిజెపి మిత్రపక్ష పార్టీగా ఇప్పటివరకూ పరిగణించారని, కానీ నిన్న ఈసీకి టిడిపి ఇచ్చిన విజ్ఞప్తిలో జనసేన తమ మిత్రపక్ష పార్టీగా పేర్కొన్నారని, దీనిపై కూడా తమ అభ్యంతరాలను తెలిపామని వివరించారు.
గాజు గ్లాసు కామన్ సింబల్ గా ఉందని, అలాంటి గుర్తును గుర్తింపులేని, కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తున్న జనసేనకు ఎలా కేటాయిస్తారని, ఈ విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ కోనేరు సురేష్ అనే వ్యక్తి ఒక్కడే ఫిర్యాదు చేశారని, 175 నియోజకవర్గాల్లో ఇన్ని బోగస్ ఓట్లు ఉన్న విషయం అతనికి ఎలా తెలుసని, ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా విచారణ చేపడతారని విజయసాయి ప్రశ్నించారు. కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో ఈ ఫిర్యాదు తప్పన్న విషయం తేలిందన్నారు.
తెలుగుదేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ ఓట్లను లక్ష్యంగా చేసుకొని, ఆ ఓట్లపై అనవసర ఫిర్యాదులు చేయిస్తోందని విజయసాయి ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ అక్రమంగా ఓటర్ ప్రొఫైలింగ్ తయారు చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేవిధంగా ఓ వెబ్ సైట్ ద్వారా యత్నిస్తోందని చెప్పారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు చాలామంది ఇక్కడ కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని, రెండు చోట్లా ఓటు ఉన్నవారివి ఇక్కడ తొలగించాలని ఫిర్యాదు చేశామని విజయసాహి వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ లు వివిధ సభల్లో సిఎం జగన్ పై చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలను కూడా ఈసి దృష్టికి తీసుకు వచ్చామన్నారు.