Monday, July 8, 2024
HomeTrending NewsTDP-Janasena: సీట్ల సర్దుబాటు...ఓట్ల బదిలీ జరిగేనా?

TDP-Janasena: సీట్ల సర్దుబాటు…ఓట్ల బదిలీ జరిగేనా?

సంక్రాంతి సందర్బంగా జనసేన అధినేత పవన కళ్యాణ్… టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై పొత్తుల అంశంపై చర్చించినట్టు తెలిసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో జనసేన- టిడిపి నేతల సమావేశంలో రాబోయే ఎన్నికల్లో వ్యూహం, ఇతర పార్టీల నుంచి నేతల రాక, సీట్ల సర్దుబాటు మీదనే ప్రధానంగా చర్చ జరిగిందంటున్నారు. ఈ సమావేశంలో టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్టు ప్రకటించటంతో గోదావరి జిల్లాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తనతో పాటు మరో నలుగురికి ఎమ్మెల్యే సీట్లు, లేదంటే తాను సూచించిన వారికే ఉభయ గోదావరి జిల్లాల్లో టికెట్లు ఇవ్వాలని ముద్రగడ మెలిక పెట్టారని సమాచారం. అదే జరిగితే కూటమి పతనం గోదావరి జిల్లాల నుంచే మొదలవుతుంది.

ముద్రగడ జనసేనలో చేరుతారని వార్తలు వచ్చిన నాటి నుంచే గోదావరి జిల్లాలోని బిసిలు, SCలు చర్చోప చర్చలు చేస్తున్నారు. కూటమి పేరుతో కమ్మ, కాపుల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని… దానికి అడ్డుకట్ట వేయాలని ఈ వర్గాల మేధావులు పిలుపిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులు సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పడుగలో ఎక్కడ చూసినా రాజకీయ చర్చలే కనిపిస్తున్నాయి.

రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల సర్దుబాటులో పీటముడి తప్పేట్టు లేదు. రాజమండ్రి రూరల్ కోసం జనసేన నుంచి కందుల దుర్గేశ్-టిడిపి నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ పడుతున్నారు. విజయవాడ పశ్చిమలో జనసేన నుంచి పోగుల మహేష్, టిడిపి నుంచి బుద్ధా వెంకన్న ఆశిస్తున్నారు. తెనాలిలో జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయనుండగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు టిడిపి ఎలా సర్ది చెప్పనుందో చూడాలి. ఇదే విధంగా తిరుపతి, విశాఖ నగరంలోని నియోజకవర్గాల్లో ప్రతిష్టంబన నెలకొనే అవకాశం ఉంది.

ఇలాంటి నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య విబేధాలు పొడసూపె ప్రమాదం ఉంది. పర్సంపరం విమర్శలు చేసుకోకున్నా లోపాయికారిగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నే అవకాశాలు మొండుగా ఉన్నాయి.

కమ్మ-కాపుల మధ్య ఉన్న సుదీర్ఘ రాజకీయ విబేదాలు మరోసారి తెరమీదకు వస్తాయని కాపు మేధావులు అంటున్నారు. వంగవీటి మోహన రంగ హత్య దగ్గర నుంచి తుని రైల్వే ప్రమాదం వరకు టిడిపి నాయకత్వంతో స్నేహంపై కాపులకు అనుమానాలు ఉన్నాయి.

టిడిపితో పొత్తు కన్నా ఒంటరిగా లేదంటే బిజెపితో కలిసి ఎన్నికలకు వెళితే జనసేనకు మేలు జరిగేదని సంక్రాంతి సంబురాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పని టిడిపి నేతలు చివరకు అరకొర సీట్లు ఇస్తారని అంటున్నారు. శాసనసభ సీట్లపై ఒప్పించే క్రమంలో… పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి వచ్చేట్టు చేస్తామని టిడిపి పెద్దలు నమ్మబలుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకు నాదెండ్ల మనోహర్ కూడా జతకలిశారని అంటున్నారు.

టిడిపి నేతల వైఖరి పరిశీలిస్తే ఏదోవిధంగా జనసేనను దారిలో పెట్టి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని…ఆ తర్వాత ఏం జరిగినా చక్కదిద్దే పని సులువవుతుందని వ్యూహం సిద్దం చేసినట్టు కూటమి నేతలు అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ లు సన్నిహితులతో మాట్లాడినపుడు స్పష్టత వస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్