చాలామంది దర్శకులు తమ సినిమాల్లో స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్స్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారని నమ్ముతుంటారు. ఇక ఈ రోజుల్లో ముందుగా కాంబినేషన్ ను సెట్ చేసుకుని అందుకు తగిన కథను అల్లుకుంటున్నారు. కానీ విశ్వనాథ్ అలా కాదు. ముందుగా కథను రాసుకుని .. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని .. అప్పుడు ఆ పాత్రలకి తగిన నటీనటులను ఎంచుకునేవారు. ఆయన సినిమాల్లో ఛాన్స్ రావడమే గొప్ప విషయం అనేట్టుగా ఉండటం వలన, ఆర్టిస్టులు ఒప్పుకోకపోవడమనేది జరిగేది కాదు.
అలాంటి విశ్వనాథ్ తీసిన క్లాసికల్స్ లో జయసుధ కనిపించలేదు. నిన్న రాత్రి జరిగిన ఆయన జయంతి వేడుకలో ఇదే విషయాన్ని గురించి జయసుధ ప్రస్తావించారు. విశ్వనాథ్ గారు ‘సాగరసంగమం’ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్న రోజులవి. ఆ సినిమాలో కథానాయికగా ఆయన నన్ను తీసుకున్నారు .. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా షూటింగు మొదలుకావడలో ఆలస్యమైంది.
అయితే నేను అప్పటికే ఎన్టీఆర్ తో ఒక సినిమాను ఒప్పుకుని ఉన్నాను. ‘సాగర సంగమం’ ఆలస్యం కావడం వలన .. ఇక ఆ సినిమా చేయలేనని చెప్పి అడ్వాన్స్ తిరిగిచ్చేశాను. దాంతో విశ్వనాథ్ గారు నాపై అలిగారు. నేను ఎక్కడ కనిపించినా అలక చూపించేవారు. చాలా సంవత్సరాల పాటు అదే కొనసాగుతూ వచ్చింది. అందువల్లనే ఆయనతో సినిమాలు చేయలేకపోయాను. అయితే నాకంటే జయప్రదనే ఆ పాత్రకి సరిగ్గా సరిపోయిందని నాకు అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : విశ్వనాథ్ గారితో నాకున్న అనుబంధం అలాంటిది: మెగా స్టార్