బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ‘బీసీలకు బాస్ వైసీపీ’ అంటూ అభివర్ణించారు. మహానాడులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కుకుంటూ వెళ్తామని బాబు అంటున్నారని… కానీ ఆయన్ను, టిడిపిని ప్రజలు ఎప్పుడో పాతాళానికి తొక్కి పాతరేశారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మహానాడు సాక్షిగా బాబు, టిడిపి నేతలు ఎన్ని రంకెలేసినా, ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ప్రజల గుండెల్లో మాత్రం జగన్ ఉన్నారని జోగి స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయాఅని బిసిలు, ఆర్ధికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల్లోని వారు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయని వారుకూడా ఈసారి ఎన్నికల్లో తమకు అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరుస్తున్న ప్రభుత్వం తమదని, డిబిటి ద్వారా 2.10లక్షల కోట్ల రూపాయలు పేదల అకౌంట్లలో వేశామని వివరించారు. పేదవారికి మేలు జరుగుతుంటే ఓర్చుకోలేని ప్రతిపక్ష నాయకుడు బాబు మాత్రమేనని విమర్శించారు. అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తున్నామని… ఈ ఇళ్ళ పునాదుల కిందే టిడిపిని పాతిపెట్టబోతున్నామని హెచ్చరించారు.
బిసిలంతా సంఘటితం అయ్యారని, జగన్ వెంట అడుగులు వేస్తున్నారని, అందుకే బిసిల్లో చీలిక తెచ్చేందుకు బాబు తెగ తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. బాబును నమ్ముకుంటే గోదాట్లో మునిగినట్లేనన్న విషయం తెలుసుకోవాలని టిడిపి కార్యకర్తలకు జోగి సూచించారు.