Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక జర్నలిస్టు ఆత్మహత్య

ఒక జర్నలిస్టు ఆత్మహత్య

ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ.

తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు మౌన రోదన అతడి/ఆమె మాటల్లోనే:-

నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత అవసరం లేనిదయ్యింది. అలాంటిది ఇక నా పేరుతో మీకేమి పని? మా ఊరిలో తప్ప దేశంలో నేను ఎక్కడయినా పని చేయడానికి పనికివస్తాను అన్న మా మేనేజ్మెంట్ జర్నలిజం వృత్తిగత ప్రాథమిక సూత్రాల ప్రకారం నా ఊరు నాది కాదు. కాబట్టి దానితో మీకు కూడా పనిలేదు. జర్నలిజం చదువుకుని…ఉస్మానియా, కాకతీయ చెట్ల కింద అర కప్పుల చాయ్ తాగుతూ పోటీ పరీక్షలు రాసి రాసి అలసి సొలసి జర్నలిజంలోకి వచ్చానా? ఇష్టపడి జర్నలిజంలోకి వచ్చానా? వచ్చాక కష్టపడి జర్నలిజం నేర్చుకున్నానా? నేర్చుకోక కష్టపడుతున్నానా? అన్న ప్రశ్నలకు నేనిప్పుడు సమాధానాలు వెతుక్కునే స్థితిలో లేను.

అందరూ పడుకుంటే నేను మేల్కొన్నాను. అందరూ మేల్కొంటే నేను పడుకున్నాను. అక్కడే నేను ప్రపంచానికి దూరమయ్యాను. ప్రపంచం కళ్లు తెరిపించే పనుల్లో నా కళ్లు మూసుకుపోతున్న విషయం నేను గ్రహించలేదు. గ్రహించే జ్ఞానం వచ్చేసరికి చేతులే కాకుండా మొత్తం శరీరం కాలుతోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. అలాంటిది శరీరమంతా కాలుతుంటే ఏ చెట్టూ నన్ను రక్షించలేదు. మానులుగా ఎదిగిన యజమానుల నీడలో ఇక ఏ చెట్టూ ఎదగదు. ఎదగకూడదు. పెరటి చెట్టు ఎలాగూ నా వైద్యానికి పనికిరాదు.

“నాకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. నేను అనంత లోక శోక భీకర తిమిరైక పతిని”.

ఇన్నాళ్లూ ప్రపంచం బాధ నా బాధ. ఇప్పుడు నా బాధ ప్రపంచం బాధ కాకుండా పోయింది. నా ఉద్యోగం ఉంటుందో? పోతుందో? తెలియదు. జీతం నెల నెలా వస్తుందో? రాదో? తెలియదు.

మా పిల్లలు పెద్దవారయ్యారు. కాలేజీలు. డొనేషన్లు. ఫీజులు. ఇంటి లోన్, వెహికిల్ లోన్ ఈ ఎం ఐ లు. అనారోగ్యాలు. ఆసుపత్రుల ఖర్చులు. అంతా అగమ్యగోచరంగా ఉంది. నేను జర్నలిస్టును కాకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు నన్ను నేను రద్దు చేసుకుంటున్నాను. నేను మనిషిగా మిగిలి ఉండడానికి దారులు వెతుక్కుంటున్నాను. నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తప్ప నాకిప్పుడు ఏ ఆదర్శాలూ లేవు. ఉన్నా నాకవసరం లేదు. ఉసురు తగిలి పోతారని తెలుగులో చేతకానివారు అనుకోవాల్సిన చేతకాని మాట. మా మనసులో మౌనంగా తిట్టుకున్నా దాన్ని అక్షరాల్లోకి అన్వయించే నిగూఢ గూఢచర్య సాఫ్ట్ వేర్ మీదగ్గరుందన్న ఎరుక మాకుంది. కాబట్టి స్వగతంలో కూడా కసితీరా తిట్టుకోలేని దీనులం. పేద జర్నలిస్టు కోపం పదవికి చేటు.

అక్షరం అంటే నాశనం లేనిది అని చాలా లోతయిన అర్థమేదో ఉన్నట్లుంది. మేము క్షయమవుతూ మేము రాసే అక్షరం మాత్రం క్షయం కాకుండా ఉండడం ప్రకృతి సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అయినా నోట మాట లేని నిర్-వచనంగా పడి ఉండాల్సిన వాళ్లం. మాటల నిర్వచనాలు మాకెందుకు?

నేను ఎన్నో వార్తలు రాశాను. హెడ్డింగులు పెట్టాను. అనువాదాలు చేశాను. ఎడిటింగులు చేశాను. సంపాదకీయాలు కూడా రాశాను. నా వార్త ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. నా వార్తకు శీర్షిక లేదు. ముగింపు ఉందో లేదో తెలియదు. ఎలా అనువదించుకోవాలో అంతుపట్టడం లేదు. నా జీతం ఎడిటింగ్ ఒక్కటే గుర్తొస్తోంది. నెల సంపాదన లేకుంటే సంపాదకీయం ఎలా రాయగలను?

లోకంలో ఎన్నెన్నో బాధలకు, కన్నీళ్లకు…కన్నీళ్ళకే కళ్లల్లో రక్తం వచ్చేలా రాశాను. నేను చలించి, గుండె బరువెక్కి రాసిన ఏయే విషాదాలు నాకిప్పుడు అన్వయం అవుతాయో నాకే తెలియడం లేదు.
ఇప్పుడు నామీద నేనే రాసుకోలేని,
నాకు నేనే అర్థంకాని ఒకానొక వార్తను”.

(పాత కథనం. జర్నలిస్టుగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛానెల్లో ఉన్నట్లుండి ఉద్యోగం ఊడబెరికిన నేపథ్యంలో బతుకు శూన్యమై కన్న కూతురితోపాటు ఆత్మహత్య చేసుకున్న వరంగల్ యోగి రెడ్డి మృతికి నివాళిగా పునర్ముద్రణ. చావలేక బతుకుతున్న యోగి రెడ్లు ఇంకా ఎందరో!)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్