Friday, November 22, 2024
HomeTrending Newsఇది చారిత్రాత్మక నిర్ణయం: కన్నబాబు

ఇది చారిత్రాత్మక నిర్ణయం: కన్నబాబు

ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభివర్ణించారు. ఈ జిఓ ప్రకారం అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న అందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని, ఎలాంటి సబ్ కేటగిరి లేదని వివరించారు. ఈడబ్ల్యూ ఎస్ కోటాలో కేంద్రం విధించిన నిబంధనలను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరింత సరళతరం చేశారని వెల్లడించారు.

ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసం చేశారని, కాపులకు ఐదు శాతం వీటిలోనే ఇస్తామంటూ ప్రకటన చేశారని  కన్నబాబు గుర్తు చేశారు. పదిలో ఐదు శాతం కాపులకే ఇవ్వడం సాధ్యం కాదని తెలిసినా కాపులను  మోసం చేశారని, ఓటు బ్యాంకు రాజాకీయాలు చేశారని ధ్వజమెత్తారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. చంద్రబాబు నిర్ణయంతో కొందరు కోర్టులను ఆశ్రయించారని తెలిపారు.

కాపులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, ఆ తర్వాతా ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కేటాయిస్తున్నట్లు మరో తీర్మానం పంపారని, ఈ రెంటిలో ఏది మీ విధానం అని కేంద్ర ప్రభుత్వం అడిగితే దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి అవలంబించారని కన్నబాబు ఆరోపించారు.

కాపులు బిసిలా, ఒసిలా అనేది తేల్చకుండా చంద్రబాబు గందరగోళం చేశారని కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ వర్గం విషయంలోనూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. సిగ్గూ శరం లేకుండా ఎలాగోలా హామీలు ఇచ్చారన్నారు. ఇంకా ఈ విషయంలో తాత్సారం చేస్తే ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు చాలా వర్గాలకు అందకుండా పోతాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కన్నబాబు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్