సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)-2020 వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదిక పై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళా తపస్వి కె. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ‘అల వైకుంఠపురం’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం అవార్డులు దక్కించుకున్న విభాగాలు ఇవే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్ (బుట్టబొమ్మ సాంగ్), ఉత్తమ ప్రతినాయకుడిగా సముద్రఖని, ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థలు ‘అల వైకుంఠపురం’ చిత్రానికి గాను అవార్డులు దక్కించుకున్నాయి.
క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా సుధీర్ బాబు (వి), ఉత్తమ కథానాయికగా ఐశ్వర్యారాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్), ఉత్తమ నేపథ్య గాయనిగా మధుప్రియ (హిజ్ సో క్యూట్…‘సరిలేరు నీకెవ్వరు’), ఉత్తమ అరంగేట్ర నటుడిగా శివ కందుకూరి (చూసి చూడంగానే), ఉత్తమ అరంగేట్ర నటిగా రూప కొడువయూర్ (ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య), ఉత్తమ అరంగేట్ర దర్శకుడిగా కరుణకుమార్ (పలాస 1978), ఉత్తమ తొలి చిత్ర నిర్మాణ సంస్థగా అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్‌మెంట్స్ (కలర్ ఫొటో), ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ హాస్యనటుడిగా వెన్నెల కిషోర్ (భీష్మ) అవార్డులు దక్కించుకున్నారు.