Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవస్తున్నాడడిగో!

వస్తున్నాడడిగో!

KA Paul Coming soon……
కె ఏ పాల్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాక తప్పని పరిస్థితి మీద ఈనాడులో ఒక వార్త వచ్చింది. మిగతా పత్రికల్లో ఈ వార్త వచ్చినట్లు లేదు.

కె ఏ పాల్ అంటే ఒక వ్యక్తి కాదు-సీరియస్ హాస్యరస చక్రవర్తి.
కె ఏ పాల్ ఒక వ్యక్తి కాదు-
ప్రపంచ శాంతి దూత.
కె ఏ పాల్ ఒక వ్యక్తి కాదు-
అవతార పురుషుడు.
కె ఏ పాల్ ఒక వ్యక్తి కాదు-
కొడిగడుతున్న నవ్వులకు నారుపోసి నీరుపోసిన శ్రామికుడు.
కె ఏ పాల్ ఒక అది.
కె ఏ పాల్ ఒక ఇది.
కె ఏ పాల్ ఒక అన్నీ.

ఈనాడులో అమీర్ పేట్ డేట్ లైన్ తో సిటీ జోనల్ పేజీలో ఆ వార్త చూసి నా గుండె తరుక్కుపోయింది. కనీసం మొదటిపేజీలో యాంకర్ ఐటెంగా నాలుగు కాలాలతో నాలుగు కాలాలు నిలిచి ఉండేలా రావాల్సిన వార్త. తీరా వార్త చదివితే అమెరికా నుండి వర్చువల్ గా ల్యాప్ టాప్ స్క్రీన్ మీద కె ఏ పాల్ మాట్లాడుతున్నారు. ఇక్కడ అమీర్ పేట్ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ విస్తృత సమావేశం ఆయన వర్చువల్ ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కాక తప్పడం లేదని కె ఏ పాల్ వాక్రుచ్చిన విషయాన్ని ఈనాడు ట్రూ స్పిరిట్ తో రిపోర్ట్ చేసింది.బహుశా ఆయన అమెరికా ఎన్నికల్లోనో, అంతరిక్ష ఎన్నికల్లోనో పోటీ గురించి మాట్లాడి ఉంటారనుకుని వార్త కిందిదాకా చదివితే…రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించే మాట్లాడారు.

అంతటి కె ఏ పాల్ ఇంత కిందికి దిగి రాష్ట్రాల్లో ఎన్నికల గురించి మాట్లాడ్డం విధి విలాసం. పోయినసారి ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి ఎన్నికల గుర్తు ఫ్యాన్ ను పోలి ఉండే రెక్కల హెలిక్యాపిటర్ గుర్తు కె ఏ పాల్ కు ఎలా వచ్చిందో? ఎందుకు వచ్చిందో? ఎవరు మేనేజ్ చేసి ఆయనకు కావాల్సిన వనరులు సమకూర్చారో లోకానికి తెలుసు.ఎక్కిన విమానం దిగకుండా గాలిలోనే ఇంధనం నింపుకుంటూ గాల్లోనే తిరుగుతూ దేశాధ్యక్షులను బ్లెస్స్ చేసిన కె ఏ పాల్ మన అదృష్టం కొద్దీ నేలకు దిగారు.

రెండేళ్లుగా కరోనాతో జీవనం నిస్సారంగా మారిపోయింది. పెదవి మీద నవ్వు పువ్వు పూచి ఎన్నేళ్ళయిందో? పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఎంతకాలమయ్యిందో?

ఈనాడు కూడా మనలాగే నవ్వులపూల కోసం నిరీక్షిస్తున్నట్లు ఉంది. ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాముతో పోలిస్తే ఏ రకంగా చూసినా కే ఏ పాల్ హాస్యం కోటి రెట్లు మెరుగయినదే. ఆ కోణంలోనే ఈనాడు కె ఎ పాల్ వర్చువల్ సందేశానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చి ఉంటుంది.కె ఎ పాల్ పెరట్లో కట్టేసుకున్న విమానాలు, పాల్ ముంగిట్లో మూలిగే హెలిక్యాపిటర్లు రెక్కవిప్పక తుప్పు పట్టి విలపిస్తున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ పోయాక తెలుగులో ప్రత్యక్షరంలో హాస్యాన్ని పండించగల హాస్యరస ధీరుడే లేడు. కె ఎ పాల్ ను చూసి నేర్చుకోవాల్సింది హాస్యరస పోషణ. అలాంటి పాల్ అమెరికా పాలకడలిమీద పవళిస్తే మనకెంత అన్యాయం జరుగుతుంది?

పాల్ ది పాలలాంటి స్వచ్చమయిన మనసు. వెన్నలాంటి మెత్తటి మనసు.

రా పాల్! రా!
మా నవ్వులకు రాజువై రా!
మా మొక్కులకు దిక్కువై రా!
మా అజ్ఞానానికి జ్ఞానమై రా!
మా చీకటికి వెలుగువై రా!
మా ఈనాడుకు ఒక పేజీవై రా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

నా ఫేస్…నా ఇష్టం

Also Read:

సంపద తెచ్చిన పైత్యం

Also Read:

స్వయంభువును నేను

RELATED ARTICLES

Most Popular

న్యూస్