Saturday, January 18, 2025
Homeసినిమాబింబిసార'గా మెప్పించిన కల్యాణ్ రామ్!

బింబిసార’గా మెప్పించిన కల్యాణ్ రామ్!

Success: కల్యాణ్ రామ్ హీరోగా .. నిర్మాతగా సక్సెస్ ను అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయినా ఎప్పటికప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ, వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ సారి ఆయన చారిత్రక నేపథ్యానికి సోషియా ఫాంటసీ టచ్ ఇస్తూ ‘బింబిసార’ సినిమా చేశాడు. అయితే ఈ బింబిసారుడు మనకి చరిత్రలో కనిపించే ‘బింబిసారుడు‘ కాదు. ఆయన పేరును మాత్రమే ఇక్కడ వాడుకోవడం జరిగింది. వశిష్ఠ అనే కొత్త దర్శకుడిని నమ్మి కల్యాణ్ రామ్ ఈ సినిమా  చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ శుక్రవారమే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.

‘త్రిగర్తల’ సామ్రాజ్యనికి చక్రవర్తి అయిన ‘బింబిసారుడు’ అత్యంత క్రూరుడు. శత్రురాజ్యాలను ఆక్రమించడం .. అక్కడి సంపదలను కొల్లగొట్టి ఒక గుహలో భద్రపరచడం ఆయన పని. ఆయన తప్ప ఆ గుహను ఎవరూ తెరవలేరు. మానవత్వం మచ్చుకు కూడా లేని బింబిసారుడు, ‘మాయాదర్పణం’ కారణంగా క్రీస్తు పూర్వం నుంచి మనకి సంబంధించిన  ప్రస్తుత కాలానికి వచ్చేస్తాడు. అహంకారంలో .. అధికారంలో లేని ఆనందాలను ఆయన ఇక్కడి  అనుబంధాలలో చూస్తాడు.

బింబిసారుడు దాచిన నిధి కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్న ఇక్కడి విలన్ కి ఒక మాంత్రికుడి ద్వారా ఆయన  చిక్కుతాడు. త్రిగర్తలలో కరవుకాటకాలను తట్టుకోవడానికి ఆ కాలంలో నిధి గుహను తెరవడానికి బింబిసారుడి సోదరుడు  ప్రయత్నిస్తుంటాడు. ఇక్కడ ఈ కాలంలో విలన్ టార్చర్ తట్టుకోలేక ఆ నిధి గుహను తెరవడానికి బింబిసారుడు ప్రయత్నిస్తుంటాడు. రెండు కాలాల్లో ఒకేసారి జరిగే ఈ ప్రయత్నమే ఈ సినిమాకి హైలైట్. ఇక్కడే ఆడియన్స్ ఉత్కంఠకు  లోనవుతారు.

కల్యాణ్ రామ్ కొత్తగా కనిపించడమే కాదు .. ఆ పాత్రలో మెప్పించాడు .. భళా బింబిసార అనిపించాడు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. ఇక చోటా కె నాయుడు కెమెరా పనితనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ గొప్పగా ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ ఆశ్చర్య చకితులను చేస్తాయి. ప్రేక్షకులను నిజంగానే మరో కాలానికి తీసుకుని వెళతాయి. రెండు కాలాల్లో కూడా కథానాయికలుగా కనిపించే కేథరిన్ .. సంయుక్త మీనన్ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. కల్యాణ్ రామ్ లుక్ విషయంలో మరి కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే .. పాటల పై మరింత దృష్టి పెట్టి ఉంటే .. రాజు పాత్ర వైపు నుంచి ఇంకాస్త కాస్త రొమాన్స్ జోడించే ఉంటే ఈ సినిమా నెక్స్ట్  లెవెల్ కి వెళ్లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్