Mini Review: ఈ మధ్య కాలంలో చాలా తక్కువ బడ్జెట్ లో ఒక కథను అనుకుని, దానిని ఇంట్రస్టింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయడానికి కొత్త దర్శకులు ట్రై చేస్తున్నారు. ఈ తరహా సినిమాలు పెద్ద బ్యానర్ల ద్వారా వస్తే పబ్లిసిటీ పరంగా ఢోకా ఉండదు. ఎక్కువ థియేటర్లకు .. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాంటి సినిమాగా వచ్చిందే ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో సంతోష్ శోభన్ – ప్రియా భవాని శంకర్ నటించగా, అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు.
శివ (సంతోష్ శోభన్) శ్రుతి (ప్రియాభవాని శంకర్) ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. శివకి బద్ధకం ఎక్కువైతే .. శ్రుతికి ఆత్మాభిమానం ఎక్కువ. శివకి ఉద్యోగమే కాదు .. బాధ్యత కూడా లేదనే విషయం శ్రుతికి అర్థమవుతుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. అవి వారి మధ్య దూరాన్నిపెంచుతూ వెళుతుంటాయి. శ్రుతి పోరు పడలేక ఉద్యోగం చూసుకుందామనుకున్నశివకి ఓ అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేమిటి? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశాలు కథలో చోటుచేసుకుంటాయి.
ప్రేమలో పడినప్పుడు ఒకరి కదలిక ఒకరికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. పెళ్లి కాగానే ఆకర్షణలు తొలగిపోయి, బలహీనతలు బయటపడతాయి. అక్కడి నుంచే అసహనాలు .. ఆవేశాలు తొంగిచూస్తాయి. నాలుగు గోడల మధ్య ఎడ మొహం .. పెడ మొహం జీవితాలు. ఇలాంటి కథతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పరిధిలో నిర్మితమైన ఈ కథలో కొత్తదనమనేది కనిపించదు. కథలో ఎలాంటి అనూహ్యమైన .. ఆసక్తికరమైన మలుపులు ఉండవు. ప్రేక్షకుల గెస్ కి ఎప్పటికప్పుడు దొరికిపోతూ నిదానంగా నడిచే ఈ కథ, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు.