నటుడిగా కమల్ కెరియర్ ను పరిశీలిస్తే, ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. నటుడిగా ఆయన చేసిన ప్రయోగాలు అలాంటివి .. దర్శక నిర్మాతగా చేసిన సాహసాలు అలాంటివి. ఇటు సౌత్ లో నైనా … అటు నార్త్ లోనైనా కొత్తగా ఒక పాత్ర చేయవలసిన సందర్భం వస్తే, ఇంతకుముందు అది కమల్ ఏమైనా చేశాడేమోనని సినిమాలు తిరగేయకుండా ఉండలేరు. ఆయన చేయని పాత్రను చేయాలంటే ఆ హీరోలు చాలా కాలం పాటు పెద్ద పరిశోధనే చేయాలి.
ద్విపాత్రాభినయంలోనే వేరియేషన్స్ చూపించడానికి చాలామంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. అలాంటిది పది పాత్రలను సైతం ఒకే సినిమాలో చేసి మెప్పించడం కమల్ కి మాత్రమే సాధ్యమైంది. అలాంటి ప్రయోగం జోలికి పోవడానికి ఇకపై ఎవరూ ప్రయత్నం చేయకపోవచ్చు. కమల్ ఇంతకుముందు చేసిన సినిమాలలో విలక్షణత పేరుతో నెగెటివ్ షేడ్స్ తో కూడిన టచ్ ఉండొచ్చునేమో. కానీ ఒక పాన్ ఇండియా సినిమాలో ఆయన విలన్ రోల్ చేయడమనేది ‘ప్రాజెక్టు K’ విషయంలో జరుగుతోంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు విలన్ రోల్స్ చేయడానికి ఆలోచన చేసేవారు. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అందువలన కమల్ కూడా విలన్ గా రంగంలోకి దిగిపోతున్నారు. విలన్ గా ఆయన విశ్వరూప విన్యాసం చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. కమల్ ఎంట్రీ తరువాత ఈ ప్రాజెక్టు రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇటు సౌత్ నుంచి .. అటు నార్త్ నుంచి ప్రధానమైన పాత్రలలో స్టార్ హీరోలను సర్దుతున్నారు. తూకం .. పాకం కరెక్టుగా కుదిరితే, ఈ సినిమా సంచలనాన్ని నమోదు చేయడం ఖాయమే.