రాజమండ్రి నగరంలో కంబాల చెరువు, పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కంబాల చెరువు పార్కును, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నేరుగా పరిశీలించారు. వ్యర్థపదార్థాలు, నాచుపట్టిన నీటితో దుర్ఘంధం వెదజల్లుతుండటంతో పార్కు సందర్శకులకు, నగర ప్రజలకు, వాకింగ్ చేసేవారికి తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. ఈ సమస్యలను ఇటీవల పార్కు పదరారంభోత్సవానికి వచ్చినప్పుడు ఎంపీ భరత్ దృష్టికి పలువురు తీసుకొచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ప్రత్యేకంగా పార్కు వాస్తవ పరిస్థితిని చూసేందుకు ఎంపీ భరత్ ఆకస్మికంగా వచ్చారు. పార్కు మధ్యలో ఉన్న నీటి కొలను పూర్తిగా నాచుపట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మున్సిపల్ ఎస్ఈ, పబ్లిక్ హెల్త్ డీఈలతో ఫోన్లో మాట్లాడారు.
నీటిని పూర్తిగా తోడించి, ఒక రెండు వారాల పాటు శుభ్రంగా ఎండబెట్టమని సూచించారు. అలాగే సూపర్ పాస్పరస్, ముగ్గు, బ్లీచింగ్ పౌడర్ వేసి చెరువును ఎండబెడితే దుర్ఘంధం రాదని సంబంధిత అధికారులకు ఎంపీ భరత్ సూచించారు. అలాగే చెరువులో వ్యర్థాలను పూర్తిగా తొలగించే ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి కంబాల చెరువు, పార్కు పనులన్నీ పూర్తవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం పార్కులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ భరత్ రామ్ పరిశీలించారు. ఈ పార్కులో వాక్ వే నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న వాకింగ్ ట్రాక్ చుట్టూ గుబురుగా పేరుకుపోయిన మొక్కలు తొలగించి, ఆహ్లాదకరమైన మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు.