Road-map row: పవన్ కళ్యాన్ బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూడడం లేదని, ఇప్పటికే తెలుగుదేశం రోడ్ మ్యాప్ లో ఇప్పటికే ఉన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తమ గురించి జనసేన, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదని, తమ దృష్టి కోణం ఎప్పుడూ ప్రజలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై పవన్ చేసిన విమర్శలపై కన్నబాబు స్పందించారు. రైతు భరోసా అనే పదం తమదేనని, పంట పెట్టుబడి కోసం తాము ఏర్పాటు చేసిన గొప్ప పథకమని, తాము ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ ఎత్తుగడ కోసమే కౌలు రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. కేవలం పబ్లిసిటీ కోసమే పవన్ విరాళం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా స్పందించింది ఉంటే ఇప్పటి పవన్ ఆందోళనను అర్ధం చేసుకుని ఉండొచ్చని, కానీ అప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు నిరసన అంటూ బయల్దేరడం కేవలం రాజకీయమేనన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తూ ఎవరైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వెంటనే పరిహారం అందించేలా సిఎం జగన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వివరించారు. పెట్టుబడి సాయం నుంచి పంట కొనుగోలు దాకా ‘విత్తనం నుంచి విక్రయం దాకా’ అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కౌలు రైతుల నుంచి కూడా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. గతంలో ఉన్న కౌలు రైతుల చట్టం కంటే మెరుగైన చట్టం తాము తీసుకు వచ్చామన్నారు. రాష్ట్రంలో 12 లక్షల 11 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. పిఎం కిసాన్ యోజన కింద కౌలు రైతులకు సాయం చేయడం లేదని, కానీ తాము వారికి కూడా రైతు భరోసా సాయం అందిస్తున్నామన్నారు.
కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ యోజన అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేకపోతున్నారని, ఒకవైపు మంచి చేస్తున్న జగన్ ను విమర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఏమీ అనడం లేదని కన్నబాబు దుయ్యబట్టారు.
Also Read : మీ రూట్ మ్యాప్ బిజెపి ఇవ్వాలా?