Sunday, March 15, 2026
Homeసినిమారిషబ్ శెట్టిని రజనీవరకూ తీసుకెళ్లిన 'కాంతార' 

రిషబ్ శెట్టిని రజనీవరకూ తీసుకెళ్లిన ‘కాంతార’ 

ఈ మధ్య కాలంలో జనమంతా ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాగా ‘కాంతార’ కనిపిస్తుంది. కన్నడంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైంది. హీరోగా .. దర్శకుడిగా అక్కడ రిషబ్ శెట్టికి అక్కడ ఓ మాదిరి క్రేజ్ ఉండేది. అందువలన 16 కోట్లలోనే నిర్మితమైన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే జనం ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుంది .. రిషబ్ శెట్టిని స్టార్ హీరోగా మార్చేసింది. ఆయన అల్లుకున్న కథలో అక్కడి ఆచారాలు .. విశ్వాసాలు .. దైవత్వంతో ముడిపడటంతో, చాలా వేగంగా ఈ కంటెంట్ కనెక్ట్ అయింది. దాంతో కాసుల వర్షం కురవడం మొదలైంది.

 తరువాత తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేశారు. 23 రోజుల్లోనే కన్నడలో 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమా, 10 రోజుల్లోనే తెలుగు .. హిందీ భాషల్లో 25 కోట్ల వరకూ రాబట్టింది. సాధారణ ప్రేక్షకుల సంగతి అలా ఉంచితే, అంతగనం ఈ సినిమాలో ఏముందా అని ప్రముఖులు సైతం చూడటం మొదలుపెట్టారు. అలా ఈ సినిమాను చూసిన రజనీకాంత్, రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా అన్నీ తానై ఈ సినిమాను నడిపించిన రిషబ్ ప్రతిభాపాటవాలను ప్రశంసించారు.

రజనీకాంత్ వంటి స్టార్ మెచ్చుకోవడమంటే అంతకుమించిన అవార్డు మరొకటి ఉండదు. అందువల్లనే రిషబ్ ఆనందంతో పొంగిపోయాడు. రజనీని కలవగానే ఆయన పాదాలను నమస్కరించుకుని ఆశీస్సులు అందుకున్నాడు. ‘కాంతార’ సినిమాను రజనీ సార్ చూడటమే గొప్ప విషయం. అలాంటిది ఆయన మెచ్చుకోవడం జీవితంలో మరిచిపోలేని రోజు. రజనీ సార్ ఒకసారి అభినందిస్తే 100 సార్లు అభినందించినట్టు అంటూ ఆయనపై తనకి గల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. మొత్తానికి ‘కాంతార’ భారీ వసూళ్లతో పాటు, ప్రముఖుల ప్రశంసలను కూడా రిషబ్ ఖాతాలో వేసేస్తోంది.

Also Read : తెలుగులో ‘కాంతార’కి బ్రహ్మరథం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular