Running-Manage: కర్ణాటకలో ఒక మంత్రి న్యాయంగానే మాట్లాడారనిపిస్తోంది. పైగా ఆయన న్యాయ, శాసనసభను నడిపే శాఖలకు మంత్రి. “మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు- ఏ పూటకా పూట మేనేజ్ చేస్తున్నామంతే”
అని ఆయన మూడు నెలల క్రితం ఎవరితోనో అన్న వీడియో వైరల్ గా తిరిగి తిరిగి…ప్రభుత్వ పనితీరుకు ప్రతీక అయి కూర్చుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ రక్తం లేని సిద్దరామయ్య కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ను భూ స్థాపితం చేశారా? లేదా? అన్నది ఇప్పటికీ సమాధానం దొరకని మిలియన్ డాలర్ ప్రశ్న. అల్ప సంఖ్యాక ప్లస్ హిందూ ప్లస్ దళిత మాటల మొదటి అక్షరాలు అ-హిం-ద కలిపి “అహింద” అన్న కొత్త సోషల్ ఇంజనీరింగ్ సూత్రాన్ని సిద్దరామయ్య కనుక్కుని…పాలనలో ఆచరణలో పెట్టారు. నిజమే “అహింద” అంటే హిందువులకు వ్యతిరేకం అన్న అర్థాన్ని గ్రహించిన హిందువులు కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఆయన చేసిన, చేస్తున్న డ్యామేజ్ నుండి బయటపడడం ఎలాగో తెలియక ప్రస్తుత కర్ణాటక పి సి సి అధ్యక్షుడు తలపట్టుకు కూర్చుంటూ ఉంటారు. కాంగ్రెస్ ను ఎప్పుడూ ప్రత్యర్థులు ఓడించరు. తనను తానే ఓడించుకోవడంలో కాంగ్రెస్ తరువాతే ఏ పార్టీ అయినా.
చూడబోతే…ఆ లక్షణాలు ఇప్పుడు బి జె పి కి కూడా అబ్బినట్లున్నాయి. బి జె పి కి కర్ణాటక దక్షిణాది ప్రవేశానికి సింహ ద్వారం. వెయ్యేళ్ళుగా వీరశైవ ఉధృతి వల్ల కర్ణాటకలో బి జె పి కి కొంత చోటు దొరుకుతోంది. పాతతరం యడ్యూరప్ప ఏకు మేకై పాతుకుపోవడం మోడీ-షాలకు నచ్చలేదు. దాంతో ఆయన్ను తప్పించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. పేరులో బొమ్మై ఉండడంతో అందరూ ఆయన్ను బొమ్మగానే పరిగణిస్తున్నారు. బసవడి పేరుకు తగినట్లు నిజంగానే బసవరాజ్ నోట్లో నాలుకలేనివారు. విధేయుడు. స్వామి భక్తి తత్పరుడు. ఎప్పుడు వెళ్లిపొమ్మంటే అప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధం అన్నట్లు ఆయన పెట్టే బేడాతో బెంగళూరు విధాన్ సౌధ ముందు నిమ్మళంగా నిలుచుని ఉన్నారు.
అంతులేని ఆయన విధేయత అమిత్ షాకు తెగ ముద్దొస్తున్నా అదే కర్ణాటకలో బి జె పి కొంపముంచేలా ఉంది. ఎన్నికలకు ముందు ఆయన్ను మార్చి తెరమీదికి ముచ్చటగా మూడో కృష్ణుడిని ప్రవేశపెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని అమిత్ షాకు తెలుసు. మారిస్తే ఒక ప్రమాదం. మార్చకుంటే మరో ప్రమాదం.
ఈ డోలాయమాన స్థితిలో ప్రభుత్వ పెద్దలందరిలో అదే అయోమయం, సందిగ్ధత తొణకిసలాడుతోంది. ఏదో ఉందంటే ఉంది…లేదంటే లేదు…అన్నట్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు అందరికీ స్పష్టత ఉంది. న్యాయశాఖ మంత్రి మధుస్వామి సోషల్ మీడియాకు దొరికి వార్తల్లో ఉన్నారు కానీ…మీడియాకు దొరకని మిగతా మంత్రులది కూడా ఇదే అభిప్రాయం.
మధుస్వామి వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దు అని ముఖ్యమంత్రి ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయబోయారు. ఇంత స్పష్టంగా అర్థమవుతుంటే ఇందులో అపార్థానికి ఆస్కారమెక్కడుంది? అని కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రిని ఓదారుస్తోంది.
ఏమాటకామాట-
సమకాలీన రాజకీయ యవనికపై “మేనేజ్” అన్న మాట నెగటివ్ కాదు. పరమ పాజిటివ్. దేన్నయినా మేనేజ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. వ్యవస్థలను మేనేజ్ చేయడం దానికదిగా ఒక రాజకీయ విద్య. కళ. నేర్పు. కూర్పు.
ఏ మేనేజ్మెంట్ కళాశాల చెప్పని పాఠం ఈ “మేనేజ్మెంట్”.
అనుకుంటాం కానీ- ఈ అనంత విశ్వమే ఒక “మేనేజ్మెంట్”. ప్రభుత్వాన్ని ఒకరు నడపకుండా “మేనేజ్” చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ!
-పమిడికాల్వ మధుసూదన్