Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఏర్పాటు చేసుకొని.. జిల్లా పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. రాష్ట్రంలో 36లక్షల పెన్షన్లు ఉన్నయ్‌. మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంచుతున్నం. కరోనాతో కొంత ఆలస్యమైంది. 57 సంవత్సరాల వారికి ఇస్తామని చెప్పాం. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తికమక అయిన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే 46లక్షలకు పెన్షన్లు చేరుకుంటున్నయ్‌. ఈ 46లక్షల పెన్షన్‌దారులకు అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నారు. రాబోయే వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని’ సీఎం కేసీఆర్‌ కోరారు.

‘‘హైదరాబాద్‌లో కరెంటు పోదు.. అదే దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు రాదు. దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా. ఆదిలాబాద్ గోండు గూడెంలో, వరంగల్ లంబాడీ తండాలో, హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఎక్కడైనా సరే 24 గంటలూ ఉంటుంది. ఇంతకుముందు చాలా మంది కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్లు, పొడుగున్నోళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్లెందుకు కరెంటు ఇవ్వలేదు? ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే మెదడు రంగరించి ఫలితాలు సాధిస్తారు. ఒకప్పుడు మంచి నీళ్ల కోసం నానా తంటాలు పడేవాళ్లు. ట్యాంకర్ల వెంటపడేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

మేడ్చల్‌లో గ్రామీణ ప్రాంతాలు తక్కువ. దాంతో ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. ఉపాధి దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. వీటి వల్ల చాలా పనులు చెయ్యాల్సి వస్తుంది. వీటికోసం అందరు ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల నిధులు ఇచ్చాం. ఇవి చాలడం లేదని ఎమ్మెల్యేలు చెప్పారు. అందుకే ఈ ఏడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు మరో రూ.పది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. రేపే దీనికి సంబంధించి జీవో విడుదల చేస్తా. ఇలా మనకు నిధులు ఉన్నాయి. కానీ కొందరు మూర్ఖులు కారుకూతలు కూస్తున్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను ఎప్పుడో చెప్పా. ఎందుకంటే మనకున్న వనరులు అలాంటివి. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొలిచే విధానంలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. వాటిలో ఒకటి తలసరి ఆదాయం. ఒకప్పుడు ఇది కేవలం రూ.లక్షగా ఉండేది. ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్‌గా రూ.2,78,500కు పెరిగింది. మనకన్నా ముందే రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లను మనం దాటేశాం.

ఇది వట్టిగానే జరుగుతుందా? అవినీతి రహితంగా అనుకున్నది అనుకున్నట్లు చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుంది. తెలంగాణ రాష్ట్రం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమమైన జీతాలు దొరుకుతాయని చెప్పా. ఇప్పుడు మన ప్రభుత్యోద్యోగులే దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్నారు. పేద పిల్లల పెళ్లిళ్లు జరిగితే ఏ రాష్ట్రంలోనైనా రూ.లక్ష ఇస్తున్నారా? ఇప్పటికే పదకొండు లక్షల కుటుంబాలకు రూ.9వేల కోట్లపైగా ఖర్చు చేశాం. దేశంలో మరెక్కడా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వరు. వికలాంగ సోదరులకు రూ.3016 ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటే. ఈ మధ్యనే డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం.
వీళ్లకే కాదు చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి ఇస్తున్నం. చాలామంది తెలంగాణ పల్లెల్లో ఏమమ్మా ఎలా ఉన్నావ్? అనడిగితే.. హైదరాబాద్‌లో నా పెద్దకొడుకు కేసీఆర్ ఉన్నాడు. డబ్బులు పంపిస్తాడని చెప్తున్నారు. అందుకే చాలా మంది కోడళ్లు అత్తమామల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముసలాళ్లే మోతుబరిగా ఉన్నారు. నేను పంపే డబ్బులో కూడా ఎంతో కొంత దాచుకుంటున్నారు. బియ్యానికి కూడా గతంలో ఇంట్లో ముగ్గురు, నలుగురికే ఇస్తామనే వారు. ఇప్పుడు ఎంత మంది ఉంటే అంతమందికి నాలుగు కాకుండా ఆరు కిలోలు ఇస్తున్నాం.

మన వనరులు మనకే దక్కడంతో ఆర్థికంగా మనం పెరిగినం. జీఎస్‌డీపీ అంటే రాష్ట్ర స్థూలఉత్పత్తి. ఇది కూడా ఒక గీటురాయి. ఇది 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షలకోట్లు ఉండేది. ఇయ్యాల అది అద్భుతంగా పెరిగి రూ.11.5 లక్షలకోట్లకు చేరింది. అధికారులు అంకితభావం, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వం లక్ష్యశుద్ధి వల్లే ఇది సాధ్యమైంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ప్రారంభించుకున్న కలెక్టరేట్ వంటి భవనాలు కూడా లేవు. మొత్తం 33 జిల్లాల్లో వీటితోపాటు పోలీసు భవనాలు కూడా తీసుకొస్తున్నాం.

దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం కూడా మనదే. వీటిలో చదువుకుంటున్న పేద విద్యార్థులు దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తున్నం. కరోనా రాకుంటే మరిన్ని గురుకులాలు పెంచేవాళ్లం. ఈ మధ్య బీసీల కోసం కొన్ని పెంచినా.. మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ల కొరత కూడా తీర్చుకున్నాం. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారు. ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వస్తున్నారు. వాళ్లందరికీ పని కల్పించే అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగాం. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com