Mini Review: కార్తికేయ తన ఫిజిక్ తోనే ఆకట్టుకున్న హీరో. మొదటి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. అయితే విజయాలు మాత్రం ఆయన కెరియర్ తో దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నాయి. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తరువాత ఆయన చేసిన సినిమాలేవీ ఆడియన్స్ నుంచి ఆ స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్టు కొట్టవలసిందేననే పట్టుదలతో ఆయన ‘బెదురులంక 2012’ సినిమా చేశాడు. నిన్ననే ఈ సినిమా విడుదలైంది.
సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన కార్తికేయ, హీరోగా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. సరైన గైడెన్స్ లేకపోవడం వలన కావచ్చునేమో, కావాల్సినంత కసరత్తు జరగకముందే ఆ కథలతో సెట్స్ పైకి వెళ్లిపోతున్నాడు. అందువలన ఆశించిన ఫలితం దక్కడం లేదు. కొత్త గ్యాప్ తీసుకున్న కార్తికేయ ఈ సారి కూడా అదే పద్ధతిలో ‘బెదురులంక 2012’ను పట్టాలెక్కించాడు. ఇది కామెడీతో ముడిపడిన కంటెంట్ నే .. అయినా చాలా తక్కువ సార్లు ఆడియన్స్ ఫేస్ లు విచ్చుకుంటాయి.
ఈ కథపై … ప్రధాన పాత్రలపై గట్టి కసరత్తు జరిగి ఉంటే, నిజంగానే ఇది ఒక మంచి సినిమా అయ్యుండేది. అలా కాకుండా చాలా తేలికగా తేల్చేస్తూ వెళ్లారు. కమెడియన్స్ ఉన్నప్పటికీ సరైన కామెడీని రాసుకోలేకపోయారు. కార్తికేయ – నేహా శెట్టి మధ్య రొమాన్స్ ను వర్కౌట్ చేయలేకపోయారు. ఒక కథకు కావలసిన అన్ని అంశాలు ఉన్నాయా లేవా? తన సినిమా నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారు? అని మసాలాలు కుదిరాయా లేదా? అనే విషయంపై కార్తికేయ ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిందే. పెద్దగా స్టార్స్ లేకుండా కంటెంటును మాత్రమే ముందు నిలబెట్టినప్పుడు, మరింతగా జాగ్రత్తలు తీసుకోవలసిందే.