Friday, October 18, 2024
HomeTrending NewsKarumuri: బాబును ప్రజలు పట్టించుకోవడంలేదు

Karumuri: బాబును ప్రజలు పట్టించుకోవడంలేదు

చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్‌ డాక్టర్లను పంపిస్తున్నారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు 371 కోట్ల రూపాయలు మెక్కేసి జైలుకు వెళ్లిన నాటి నుంచి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారు ఏమి చేసినా ప్రజలు మాత్రం ఒక్క క్షణం కూడా బాబు గురించి ఆలోచించడం లేదని, సిఎం జగన్ ఆ విధంగా పరిపాలిస్తూ అందరికీ మేలు చేస్తున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఎంతసేపూ ఎల్లో మీడియాలో డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు.  తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కారుమూరి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయలేదని ఆయన సామాజికవర్గానికి చెందిన వారు కూడా భావిస్తున్నారని, ఆయన ఎన్నో తప్పులు చేశారని, ఇప్పుడు పాపం పండి, జైలుకు వెళ్లారని వారు కూడా అనుకుంటున్నారని కారుమూరి చెప్పారు. కోర్టుల్లో లాయర్లకు కోట్లు వెదజల్లుతున్నారంటే, ఏ స్థాయిలో చంద్రబాబు దోపిడి చేశారనేది అర్ధమవుతుందన్నారు,

పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇంతకాలం చంద్రబాబు, లోకేశ్‌.. ఏం మాట్లాడారో.. ఎలా తిట్టారో.. అవన్నీ ఇప్పుడు పవన్‌తో మాట్లాడిస్తున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు పూర్తిగా ప్లేట్‌ ఫిరాయించారన్నారు.  ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడుతో సిఎం జగన్ ను అదేపనిగా విమర్శిస్తున్నారని పవన్ పై కారుమూరి అసహనం వ్యక్తం చేశారు. తమ ఎజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పకుండా… షూటింగ్‌ విరామంలో వచ్చి యాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శలు  చేస్తున్నారని  అన్నారు.

“పవన్‌కు ఒక దశ, దిశ లేదు. దేనిపైనా అవగాహన లేదు. ఆయన ఎప్పుడు, ఏం మాట్లాడతాడో అర్ధం కాదు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆలోచించండి. జగన్‌గారు ఎవరికీ భయపడరు. ఆరోజు సోనియాను ఎదిరించారు. ప్రజల్లో నిల్చి, వారి హృదయాలు గెల్చుకుని అధికారం చేపట్టారు. లోకేశ్‌ను ఢిల్లీలో ఎవరూ ఆదరించలేదు. చంద్రబాబు అరెస్టును ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎంత అవినీతిపరుడో ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు.  స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి ఆయన చాలా వాటిలో అవినీతి చేశాడు. ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. అందులో, రూ.125 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ స్కామ్‌ కూడా బయటకు వస్తోంది” అంటూ కారుమూరి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్