Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకరుణానిధి కలం

కరుణానిధి కలం

‘Wality 69’ Karunanidhi constant companion 

ఇప్పటికీ నాకు సిరా పెన్నే ఇష్టం. బాల్ పెన్ను, జెల్ పెన్నులు ఎన్నిరకాలొచ్చినప్పటికీ నాకిష్టం సిరాపెన్నే. అందులోనూ ఒకింత లావుపాటి పెన్నంటే మరింత ప్రేమ.
ఎవరైనా సిరా పెన్నుతో రాస్తున్నట్టు కనిపిస్తే ఎంతానందమో నాకు….వారెవరైనా కావచ్చు. అమ్మయ్య సిరా పెన్నుతో రాసే వారు ఉన్నారింకా అనుకుంటాను. మేముంటున్న మౌలాలీ (హైదరాబాద్)లో మా ఇంటికి సమీపంలో ఓ మూడు స్టేషనరీ షాపులున్నా ఒక్క దాంట్లోనూ సిరా పెన్నులు అమ్మడంలేదు. ఎందుకమ్మడం లేదంటే ఇప్పుడెవరు సార్ కొంటారంటారు.

అదలా ఉంచితే…తమిళనాడు రాజకీయ చరిత్రలో ప్రముఖులైన ఎం. కరుణానిధి పదవిలో ఉన్నా లేకున్నా ఆయనకో విధంగా చెప్పాలంటే సిరాపెన్ను ఓ సహచరిలాంటిదే. 

అందులోనూ వాలిటీ 69 (wality 69) అంటే ఆయనకు మహాప్రియం. అదికూడా బ్రాడ్వే (మద్రాసు)లోని ఓ దుకాణంలో నించే తెప్పించుకునే వారు. ఆయన లేచి లేవడంతోనే ముందుగా చూసుకునేది ఫౌంటైన్ పెన్నునే.

1942లో మురసొలి అనే పత్రిక మొదలుపెట్టినప్పటి నుంచీ ఆయనకు ఈ పెన్నుతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదే.

2001 జూన్ 30వ తేదీ తనను అరెస్టు చేసిన రోజుకూడా ఆయన చొక్కాజేబులో ఈ సిరాపెన్ను ఉంది. ఆయన తన పెన్ను వంక ఎంత గర్వంగా ప్రేమగా చూసుకునే వారో చెప్పలేమంటారు సన్నిహితులు.ఆయనకు ఇంకుపెన్నంటే అంత ప్రియం. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రోడ్డులో జెమ్ అండ్ కో అనే పెన్నుల దుకాణం (ఇప్పుడుందో లేదో నాకు తెలీదు) ఉంది. అక్కడే ఆయనకెంతో ప్రాణప్రదమైన వాలిటీ పెన్ను ఉండేది. ఆయన స్వయంగా ఆ దుకాణానికి వెళ్ళి పెన్ను కొనుక్కునేవారట.

ఆయన మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు సచివాలయ సిబ్బందితో జెమ్ అండ్ కో నుంచి తనకో సిరా పెన్ను తెప్పించుకున్నారు.

జెమ్ అండ్ కో మూడవ తరం యజమాని ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఎవరో ఒకరు తమ దుకాణానికి వచ్చి “ము.క” (ము. కరుణానిధి) పెన్ను కావాలని అడిగి కొనుక్కునే వారంటారు.

కరుణానిధి పొద్దున్నే ఈ ఫౌంటైన్ పెన్నుతో తప్పక రాసేవారు. ఈ విషయాన్ని  ప్రముఖ పాత్రికేయుడు ఎస్. రామస్వామి చెప్పారు.
కరుణానిధి వ్యాసాలు, పార్టీ కార్యకర్తలకు ఉత్త‌రాలు రాయడం పూర్తయ్యాక ఆయన వ్యక్తిగత కార్యదర్శి షణ్ముగం వాటినన్నింటినీ టైప్ చేసి పెట్టేవారు. ఉడన్ పిరప్పే (తోడబుట్టిన వాడా) అని మొదలుపెట్టి “ము.క” అని సంతకం చేసిన ఆయన ఉత్తరాలు మురసొలి దినపత్రిక మొదటి పేజీలో వెలువడేవి. అవి పార్టీ కార్యకర్తలకోసం రాసినవే అయినా అవి ఎంతో కవితాత్మకంగా ఉండేవి. నాకందుకే ఆయన రచనలంటే మహా ఇష్టం. అలాగే ఆయన స్వరమన్నా ఇష్టమే.

Karunanidhi Companion :

ఆయన రాసేవన్నీ స్పష్టంగా అందంగా ఉండేవి. ఎక్కడా కొట్టి వేతలుండేవి కావు. ఆయన రాయడం మొదలుపెట్టడంతోనే మాటల ప్రవాహం ఆగక కొనసాగేది కాగితాలపై. తొలి రోజుల్లో ము. కరుణానిధి Mu. Karunanidhi అని సంతకం చేసేవారు. తర్వాతి రోజుల్లో ము.క. అని సంతకం చేసేవారు.

ఆయన వ్యాసాలూ ఉత్తరాలే కాక మురసొలి పత్రికకు కార్టూన్లు కూడా వేసేవారన్నది కొద్ది మందికే తెలుసు. ఆయన ప్రత్యేకంగా నవలలూ రాశారు. అలాగే దక్షిణ వేదంగా తమిళులు చెప్పుకునే వల్లువర్ తిరుక్కురళ్ కి కరుణానిధి సులభశైలిలో వ్యాఖ్యానం కూడా రాశారు.ఆయన మురసొలి పత్రికలో కరికాలన్ అనే కలంపేరుతో ప్రశ్నలకు జవాబులు రాస్తుండేవారు.

చివరి రోజుల్లో ఆయన లావుపాటి పెన్నుని పట్టుకోలేక బాల్ పాయింట్ పెన్నుతో రాయడం మొదలుపెట్టారు. అంతెందుకు…1990 దశకంలో కంప్యూటర్ 
మీద టైప్ చేయడం నేర్చుకున్నారు. కానీ రాయడానికే ఇష్టపడేవారు.

ఏదేమైనా ఇంకు పెన్నుతో రాయడంలోని ఆనందమే వేరు. నా దగ్గరా వాలిటీ పెన్నులుండేవి. నాకు మా పెద్దన్నయ్య శ్యామల్రావువల్లే ఈ పెన్నులపై ప్రేమ కలిగింది. నేనేమీ రచయితను కాకున్నా పుస్తకాలు, పెన్నులతో ఉన్న అనుబంధం ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.తన పుట్టింరోజుకోమారు ప్రముఖ కవి వైరముత్తు ఆశీస్సుల కోసం కరుణానిధి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన వాలిటీ పెన్నుని తనకు కానుకగా ఇచ్చారట. ఈ కానుక అపూర్వమైనదిగా వైరముత్తు చెప్పుకున్నారు కూడా.

– యామిజాల జగదీశ్

Read More: నష్టాలకు ప్రేక్షకులే ఇవ్వాలి పరిహారం!

Read More:ఎస్ బి ఐ వారి ఆరోగ్య సలహాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్