తెలుగు! తెలుగు! గో అవే!

నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటి పేజీ రంగుల ప్రకటన ఇది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఎన్నో ఏర్పడ్డా రాజకీయ పరిభాషలో ఉమ్మడి జిల్లాగా పాత ఉనికినే గర్వంగా, గొప్పగా చెప్పుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా ఉమ్మడి నల్లగొండ జిల్లా బియ్యం మిల్లులవారు, బహుశా ఆ ప్రాంతానికే చెందిన ఒక ఇన్ఫ్రా కంపెనీ స్పాన్సర్ చేయగా మంత్రి జగదీష్ రెడ్డి పేరు లేకుండా, ఆయన ఫోటో కింద కె టీ ఆర్ గుణగణాలను వర్ణిస్తూ డిజైన్ చేసిన ప్రకటన ఇది. తెలుగు పత్రికలో, తెలుగు ప్రకటనలో ముందు చెప్పిన మాటలు ఇంగ్లీషులో ఉంటేనే బలంగా ఉంటుందన్న ప్రకటన కాపీ రైటర్ తపనను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో చెప్పినట్లు-
“Father of Telangana KCR
Future of Telangana KTR
1 Day to go
Advance Happy Birthday to
King To Rule- KTR”
అన్న పులకిత రచనలో రచయిత ప్రజాస్వామ్యం నుండి తిరోగమించి రాచరికంలోకి వెళ్ళిపోయాడు…పాపం.
కాబోయే ముఖ్యమంత్రి కె టి ఆర్ అన్న ధ్వనిని “కింగ్ టు రూల్” అన్న పొడి అక్షరాల వ్యాప్తిలో సాధించిన ఈ రచయితకు భాషలో ఉన్న అత్యున్నత అవార్డులన్నీ ఇవ్వాల్సిందే.

ఇందులో పేరులేని మంత్రి, పేరున్న ఫాదర్, పేరు తెచ్చుకుంటున్న ఫ్యూచర్ ల ప్రమేయం ఉండకపోవచ్చు. అచ్చుకు ముందు వారు కనీసం ఈ ప్రకటనను చూసి ఉండరు కూడా. కానీ అచ్చయ్యాక దీనివల్ల జరిగే నష్టంలో మాత్రం వారు కూడా భాగం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక పక్క తన పుట్టిన రోజుకు బొకేలు కూడా ఇవ్వకండి, మొక్కలు నాటి, రక్షించండి…అని కె టీ ఆర్ అడుగుతుంటే…అభిమానులు మాత్రం అడుగడుగునా ఆయనలో రాజును, ఆయన అందించబోయే రాచరిక పాలనను చూస్తున్నారు.

దాశరథులు, కాళోజీలు, సినారెలు రాయగా ప్రతి అక్షరం అగ్ని కణమై వెలిగిన, ప్రతి పదం మంత్రమయమై పలికిన తెలంగాణాలో… తెలుగంటే ప్రాణమిచ్చే సాహితీపిపాసి కె సీ ఆర్ పాలనలో…ఒక శుభ సందర్భానికి సరయిన తెలుగు రాసేవారు దొరికినట్లు లేరు!

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *