Friday, March 6, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది ఆత్మవిశ్వాసం? ఏది తల పొగరు?

ఏది ఆత్మవిశ్వాసం? ఏది తల పొగరు?

గత ఇరవై ఐదేళ్ళుగా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బానేగా కరోడ్ పతి 17 వ సీజన్(KBC-17) లో గత వారం ఒక ఎపిసోడ్ లో ఇషిత్ భట్ అనే ఒక 10 ఏళ్ల అబ్బాయి ప్రవర్తన ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక చర్చనీయాంశం అయింది.

నేను గత కొన్నేళ్ళుగా కె బి సి చాలా శ్రద్ధగా చూస్తున్నాను. హాట్ సీట్ దాకా వచ్చిన చాలా మంది దాదాపు సగం ప్రశ్నలకు బాగానే జవాబులు చెబుతారు. కాని పౌరాణిక సంబంధ ప్రశ్నలకి మాత్రం, వయసు, పెరిగిన పరిస్థితులు, విద్యార్హతలు, ఇలాంటి వాటికతీతంగా దాదాపు అందరూ లైఫ్ లైన్ సహాయం లేకుండా జవాబు చెప్పిన వాళ్ళని నేనింతవరకు చూడలేదు.

హాట్ సీట్ గెలిచిన తరువాత ఆ అబ్బాయి రావటం తోనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించటం మొదలు పెట్టాడు. కొంతవరకు అమితాబ్, ప్రేక్షకులు అది చూసి చప్పట్లతో ప్రోత్సహించారు. అమితాబ్ ఆట నియమాలు చెబుదామని మొదలు పెట్టేలోగా ఆ అబ్బాయి “నాకన్నీ నియమాలు తెలుసు, సమయం దురుపయోగం చేయకుండా మీరు నేరుగా ఆట మొదలు పెట్టండి” అని అన్నాడు (ప్రేక్షకులనుండి చప్పట్లు).

మొదటి నాలుగు ప్రశ్నలు చాలా సులభమైనవి. ఆ అబ్బాయికి జవాబులు తెలుసు. అమితాబ్ ఆప్షన్స్ చెప్పకముందే జవాబులు చెప్పాడు, అయినా గాని ఆట నియమం ప్రకారం, ఆప్షన్స్ చెప్పడం మొదలు పెట్టిన తరువాత 45 సెకన్ల గడువు మొదలవుతుంది కనుక, మనకు జవాబు తెలిసినా గాని ఆప్షన్స్ చెప్పిన తరువాతనే సరియైన ఆప్షన్ ఎంచుకొని ఆ జవాబుని లాక్ చేయమని ఆడగాల్సి ఉంటుంది. అది ఆట నియమం. ఆ అబ్బాయి ఓపిక లేకుండా అమితాబ్ ను ఆప్షన్స్ చెప్పనివ్వకుండా జవాబులు చెప్పాడు.  ఇది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది.

ఇక ఆ అబ్బాయి నిష్క్రమించిన ప్రశ్న విషయానికి వస్తే (ఈ స్థితిలో అతనికి అన్నీ లైఫ్ లైన్స్ అందుబాటులో ఉన్నాయి)

ప్రశ్న: ఈ క్రింద సూచించిన వారిలో ఎవరు కౌరవుడు?
ఆప్షన్స్:– అర్జునుడు, భీముడు, ద్రోణుడు, దుర్యోధనుడు.

ఆ అబ్బాయి లైఫ్ లైన్ ఏమీ వాడకుండా, ఆలోచించకుండా, ద్రోణుడు అని తప్పు జవాబు చెప్పాడు. అప్పటికీ అమితాబ్ ఆ అబ్బాయిని సరిగా ఆలోచించుకొని అవసరమైతే లైఫ్ లైన్ సహాయం తీసుకొని జవాబు చెప్పమని హెచ్చరించారు. ఆ అబ్బాయి మాత్రం తొందరపాటుతో కొంచెం తల బిరుసుతో “మీరు ఒకటికి నాలుగు తాళాలు వేసుకోండి, కానీ మొదట ద్రోణుడి పైన లాక్ అయితే వేయండి” అని జవాబు చెప్పాడు. కొంచెం అసహనానికి లోనైన అమితాబ్ ఇక చేసేదేమీ లేక, ఆ అబ్బాయి చెప్పిన ఆప్షన్ ని లాక్ చేశారు. పర్యవసానంగా అబ్బాయి ఏమి గెలుచుకోకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది.

ఈ మొత్తం ఎపిసోడ్లో అమితాబ్ వ్యవహరించిన తీరు అనన్యసామాన్యం. ఎక్కడా ఆయన విసుక్కోలేదు. ఏమి గెలుచుకోకుండా నిష్క్రమించినందుకు ఆయన ఆ అబ్బాయికి సానుభూతి కూడా తెలిపారు.

ఈ సంఘటన పైన సోషల్ మీడియాలో కొంచెంచర్చ(రచ్చ) నడుస్తున్నది. ఇందులో సమర్థించేవారు, వ్యతిరేకించేవారు ఎవరికి వారు వారివారి కోణంలో వాదిస్తున్నారు. ఒకే అంశానికి బొమ్మాబొరుసుగా ఈ చర్చను చూస్తే –

బొమ్మ:-
ఆ అబ్బాయిని అలా దురుసుగా పెంచిన తల్లిదండ్రులు నిందనీయులు. పిల్లలకు జ్ఞానంతో పాటు కొంచెం అణుకువగా కూడా ఉండేట్లు పెంచాలి. వినయం లేని విద్య భాసించదు.

బొరుసు:-
కానీ ఈ రోజుల్లో అణుకువ, ఓపిక ఉన్నవాళ్ళని చేతగాని వాడి కింద పరిగణిస్తున్నారు. ఎక్కడ అణుకువ ప్రదర్శించాలి, ఎక్కడ దర్పం ప్రదర్శించాలి అనేది కొంత అనుభవం ద్వారా తెలుస్తుంది. చుట్టూ ఉన్న సమాజం, పెరిగిన పరిస్థితులు, పిల్లల ముందు తల్లిదండ్రుల (కుటుంబంలోని ఇతర పెద్దలు, బంధువులు) వ్యవహారం; స్నేహితులు, బడిలో గురువులు, ఇలా చాలా విషయాలు పిల్లల పైన ప్రభావం చూపిస్తాయి.

బొమ్మ:-
ఈ తరం మధ్య తరగతి తలిదండ్రులు, తాము అనుభవించని ఫ్రీడమ్ (విచ్చలవిడి తనం) తమ పిల్లలు అనుభవించకుండా ఆపాలనుకోవడం లేదు.

బొరుసు:-
అందరూ కాకున్నా చాలా మంది తల్లిదండ్రుల ఆలోచనా విధానం దాదాపు ఇలాగే ఉన్నది. అయితే, తాము అనుభవించని వసతులు, పిల్లలకు సమకూర్చాలి అని అనుకోవడంలో తప్పులేదు, కానీ మేము భయపడుతూ పెరిగాము కనుక మా పిల్లలు విచ్చలవిడిగా ఏ మాత్రం అణుకువ లేకుండా పెంచుతాం అనుకోవడం కూడా సరి కాదు.

బొమ్మ:-
పెరిగే క్రమంలో పిల్లలు తప్పులు చేస్తూ ఎక్కడ ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు, దాని కోసం ఇంత రచ్చ అనవసరం. ఇలా ట్రోల్ చేయడంవల్ల ఆ అబ్బాయి భవిష్యత్తుపైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఆ తల్లిదండ్రులు కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుంది.

బొరుసు:-
ఏ మూలన ఎవ్వరు ఏ చిన్న తప్పు చేసినా సామాజిక మాద్యమాల్లో ట్రోల్ చేసి ఊదరగొడుతున్న సమాజంలో ప్రస్తుతం జీవిస్తున్నాము కాబట్టి, కోట్ల మంది చూసే రియాలిటీ షోల్లో మన ప్రవర్తన వేలెత్తి చూపే విధంగా ఉండకుండా చూసుకోవాలి.

బొమ్మ:-
అ అబ్బాయి ఏమీ గెలుచుకోలేదు కాబట్టి అతని వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ అతనుగనుక ఓ 25 లక్షలు గెలుచుకొనుంటే అతని తెలివినీ, యాటిట్యూడ్ ని ఆకాశానికెత్తేవారు గదా.

బొరుసు:-
ఇది ముమ్మాటికీ నిజం. ఆ అబ్బాయి గనక కొంత గెలుచుకొని ఉంటే, ఆ తలిదండ్రులు వారి సమాజంలో గర్వంగా చెప్పుకునేవారు. సమాజం కూడా వారిని సెలెబ్రిటీగా చూసేది.

బొమ్మ:-
కార్యక్రమ నిర్వాహకులు కావాలనే టీ ఆర్ పి కోసం ఇలా స్క్రిప్ట్ ప్రకారం చేశారు.

బొరుసు:-
మధ్య మధ్య లో అమితాభ్ వ్యాఖ్యానం, పోటీదార్ల కష్టాలు లాంటివి టీ ఆర్ పి కోసం స్క్రిప్ట్ ప్రకారం నడిపిస్తారు, కావచ్చు కానీ కె బి సి లాంటి జ్ఞానం ఆధారిత రియాలిటీ షోల్లో ప్రశ్నల మధ్యలో ప్రోగామ్డ్ స్క్రిప్ట్ నడిపిస్తారని నేననుకోవడం లేదు. ఇదే గనక నిజమైతే ఈ విధంగా ఒక మైనర్ అబ్బాయి వ్యవహర శైలిని ఇలా నెగటివ్ ప్రభావం పడేలాగా స్క్రిప్ట్ తయారు చేసినవారు నిందనీయులు.

ఏదేమైనా ఎన్ని మూర్తులో అన్ని ప్రకృతులు. ప్రతి మనిషీ ప్రత్యేకమైన వ్యక్తే. ఒక వ్యక్తి ప్రవర్తన కొంత పుట్టుకతో వస్తుంది. కొంత విద్య ద్వారా వస్తుంది. కొంత పరిసరాలద్వారా వస్తుంది. కొంత పరిస్థితుల వల్ల వస్తుంది.

సర్వే జనాః సుఖినోభవంతు.

-రాధకృష్ణ రేగళ్ల
సింగపూరు
[email protected]
Mobile: +65-91126318

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular