Friday, November 22, 2024
HomeTrending Newsతెలంగాణలో కెసిఆర్ హవాపై అనుమానాలు

తెలంగాణలో కెసిఆర్ హవాపై అనుమానాలు

ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. తుంటి ఎముక విరిగి అనారోగ్యం కారణంగా ఇన్నాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కెసిఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయగా… పార్టీ శ్రేణుల హడావిడి అంతాఇంత కాదు. రాష్ట్రానికి కెసిఆర్ ఇంకా సిఎం అన్నట్టుగా వ్యవహరించారని విపక్ష నేతలు అంటున్నారు.

కెసిఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయని ఊహించుకుంటున్నారని శాసనసభ వద్ద కోలాహలంతో బోధపడుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కారు స్పీడు పెంచుతామని…అధినేత రంగంలోకి దిగారని గులాబీ దండు సంబరంగా ఉంది. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో నాయకత్వం పార్టీ క్యాడర్ కు దూరం అయిందనే అపవాదు ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న సమీక్షల్లో చేదు నిజాలు వెలుగు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఏనాడు పార్టీ నేతలను పట్టించుకున్న దాఖలా లేదని మొహం మీదే చెపుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని వదిలేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు దక్కాయని ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక నుంచి అలా జరగదని కేటిఆర్ సర్దిచెపుతున్నా… పార్టీ ద్వీతీయ శ్రేణి నేతల్లో విశ్వాసం కలగటం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు బుంగ పడటం… విజిలన్సు విచారణలో నిర్మాణ లోపాలు బయటకు రావటంతో తెలంగాణ సమాజంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కెసిఆర్ తెలంగాణ ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్నారని అనుకుంటే. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృధా అయిందని విజిలెన్సు తనిఖీల్లో వివరాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ ప్రజల్లో కారు గుర్తు అంటేనే ప్రజలు గుర్రుగా మాట్లాడుతున్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులకు కొర్రీలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. వికారాబాద్ దగ్గర నేవీ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు బైసన్ పోలో గ్రౌండ్ స్థలం సచివాలయానికి ఇవ్వాలని లింక్ పెట్టడంతో ఇన్నాళ్ళు అది ఆగిపోయింది. ప్రభుత్వం మారగానే నేవీతో ఒప్పందం జరిగి ప్రాజెక్టు పట్టాలకు ఎక్కుతోంది. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తికాకుండానే ప్రారంభించారని తొమ్మిదేళ్ళలో దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఒరిగింది ఏమి లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం నుంచి రావల్సిన వైద్య కళాశాలల విషయంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం సొంతంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది లేక ఈ ఏడాది కొన్ని కళాశాలల్లో సీట్లలో కోత పడే ప్రమాదం పొంచి ఉంది. అవసరానికిని మించి కొత్త జిల్లాల ఏర్పాటు చేయటం ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

కెసిఆర్ హయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రహాసనంగా మారింది. ఏ నోటిఫికేషన్ కూడా కోర్టు గడప తొక్కకుండా పూర్తి చేసింది లేదు. సిఎం బంధు వర్గంలో కొందరికి ప్రవేశ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వటం.. జీతాలు తీసుకోవటం ఇలా ఇష్టారాజ్యంగా సాగిందని విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగులు రాబోయే ఎన్నికల్లో కూడా గులాబీని కరుణించే సూచనలు కనిపించటం లేదు.

దళితబందు పంపిణీలో అక్రమాలకు అంతు లేదు. ధరణితో సమస్యలు తీరుతాయని అనుకుంటే ప్రభుత్వ స్థలాలు పాలకుల పాలు అయ్యాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెపుతోంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. హైదరాబాద్ సమీపంలో 20 ఎకరాలు చెరపట్టారని వార్తలు వచ్చాయి. దానికి రైతుబందు తీసుకున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు జాతీయ రహదారికి ఇచ్చిన స్థలానికి కూడా రైతుబంధు అందుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఎదో ఒక విధంగా పక్షపాత ధోరణి కనిపిస్తోందని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పథకాలపై ప్రచారం చేసుకోవటం అంత సులువు కాదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై విమర్శలు చేస్తే ప్రజలు వినిపించుకునే వాతావరణం లేదు.

దీంతో కెసిఆర్ ఏ అంశాలపై ప్రజల్లోకి వెళతారో వేచి చూడాలి. కాంగ్రెస్ పథకాలపై కేటిఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలు ప్రజలను ఆకట్టుకోవటం లేదు. ప్రస్తుత పరిస్థితే లోక్ సభ ఎన్నికల సమయంలో కొనసాగితే కారు నేతలకు నిరాశ తప్పేట్టు లేదు. గత ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుంటున్న ప్రజలు మునుపటి మాదిరిగా కెసిఆర్ ప్రసంగాలకు మైమరిచే అవకాశాలు సన్నగిల్లాయని విశ్లేషకుల అంచనాగా ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్