ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఈ రోజు రేవంత్ పరామర్శించారు. విహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని, ఆయన ఆరోగ్యం కుదటపడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్ లో ఉన్నా ప్రజా సమస్యలపై నాతో చర్చించారన్నారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారని, రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారన్నారు. సోనియా గాంధీ వద్దకు ఇద్దరం కలిసి వెళ్దామన్న వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని రేవంత్ వెల్లడించారు.
హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని విమర్శించారు. దళిత సాధికారత పథకం కింద నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహపూరితమైనదని ఆరోపించారు. కెసిఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.