Sunday, November 24, 2024
HomeTrending NewsYSRTP: బీసీలకు సాయమంటూ ‘నయా’వంచన - షర్మిల విమర్శ

YSRTP: బీసీలకు సాయమంటూ ‘నయా’వంచన – షర్మిల విమర్శ

ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడన్నారు. మంత్రి వర్గ సమావేశంలో బిసీలకు నిధులు కేటాయించటంపై వైఎస్ షర్మిల ఈ రోజు ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడని, గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడని మండిపడ్డారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు దొర అన్నారు.

9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులను కెసిఆర్ పక్కదారి పట్టించాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదన్నారు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదని, బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.

ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కిందని, 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదని, బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదన్నారు. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డాడని మండిపడ్డారు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె.. చేపలు పట్టుకోవాలె.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన దొరకు.. 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయని వైఎస్ షర్మిల హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్