Saturday, January 18, 2025
HomeTrending Newsకవిత జైలుకు.. నేతల వలసలు.. కెసిఆర్ మౌనం...

కవిత జైలుకు.. నేతల వలసలు.. కెసిఆర్ మౌనం…

రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలంటే తన మన భేదం లేకుండా అడుగులు వేస్తేనే లక్ష్యం చేరుకుంటామని…రాజనీతి తత్వవేత్త మాఖియావెల్లి ఆధునిక రాజకీయాలను విశ్లేషించారు. కెసిఆర్ ఇదే అనుసరించారని చర్చ జరగుతోంది. ఒకప్పుడు మాఖియావెల్లి సిద్దాంతాన్ని మన దేశ ప్రధానమంత్రిగా చేసిన ఉక్కు నేత అనుసరించేవారట. ఆ నేత ప్రాణాల మీదకు తెచ్చుకోగా… ఇప్పుడు కెసిఆర్ రాజకీయ భవిష్యత్తునే ఫణంగా పెట్టారని రాజకీయ విశ్లేషణ జరుగుతోంది.

మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు పంపారు. ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ రాజకీయ నేరస్థురాలిగా కవిత పేరు నిలిచింది. తెలంగాణ సాధించిన నేతగా కెసిఆర్ పేరు సంపాదిస్తే… అవినీతి ఆరోపణలతో తిహార్ జైలుకు వెళ్ళిన నేతగా కవిత పేరొందారు. కవితపై ఆరోపణలు… అరెస్టు… జైలుకు వెళ్ళటం వెనుక పెద్ద మతలబే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కవిత అంశం చర్చించే ముందు కెసిఆర్ గురించి కొంత చెప్పుకోవాలి. రాజకీయాల్లో కెసిఆర్ ది విభిన్న శైలి. ప్రత్యర్థి పార్టీల్లో కొందరు ఈయనకు ఆప్తులు ఉంటారు. అవసరం అయినపుడు వాళ్ళ సాయం తీసుకోవటం… అదే విధంగా వారికి సాయం చేయటం కెసిఆర్ రాజకీయ చతురతకు నిదర్శనం. కెసిఆర్ రాజకీయ ప్రస్తానం పరిశీలిస్తే తెలుస్తుంది.

2004 ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ గెలిచేందుకు సురేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని… 2009లో సబితా ఇంద్రా రెడ్డికి సహకరించేందుకు స్థానికేతరుడైన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో బిజెపి సిట్టింగ్ అభ్యర్థుల మీద పోటీకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థులను పరిశీలిస్తే మరింత స్పష్టత వస్తుంది.

ఇంత తెలివిగా నడుచుకునే కెసిఆర్ కవిత వ్యవహారంలో మాత్రం బోల్తా పడ్డాడని రాజకీయ వర్గాల్లో టాక్. 2019 ఎన్నికల్లో బిజెపికి సహకరించేందుకే హిందూ గాళ్ళు… బొందుగాళ్ళు ఆని కెసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గులాబీ నేతలే చెప్పుకుంటారు.

తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ కు దూరం అయ్యాక కెసిఆర్ బిజెపికి దగ్గర అయ్యారు. రాష్ట్రానికి నిధులు, పాలన వ్యవహారాల్లో సహకారం కోసం తప్పు లేదని ప్రజలు భావించారు. ఢిల్లీ నేతలతో ఉన్న సఖ్యత కాపాడుకునేందుకు 2019 లోకసభ ఎన్నికల్లో  పరోక్షంగా సహకరించారని వినికిడి.

టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకొని జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించటం వరకు బిజెపి సహకారం ఉందని సమాచారం. ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి ఆఘమేఘాల మీద స్థలం కేటాయించటం ఇందులో భాగమేనట! జాతీయ స్థాయిలో బిజెపికి సహకరిస్తే.. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ను రాజకీయంగా అడ్డుకోవటం సులువనే కోణంలో బిజెపి జాతీయ నేతలతో తెరచాటు స్నేహం కొనసాగించారని విమర్శలు ఉన్నాయి.

ఇందుకోసం 2019లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కవిత ఎంపిగా ఓడిపోయారు. మొన్నటి(2023) శాసనసభ ఎన్నికల్లో మద్యం ఆరోపణల్లో తనిఖీలు జరిగినా కవితను అరెస్టు చేయలేదు. బిజెపి – బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో రెండు పార్టీలు నష్టపోగా.. ఏకంగా కెసిఆర్ గద్దె దిగాల్సి వచ్చింది.

ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో మరోసారి ఈడి విచారణ జరుగగా కవితను అరెస్టు చేయటం… జైలుకు పంపటం చకచక జరిగిపోయాయి. ప్రభుత్వంలో ఉన్నపుడు కవిత ఈడి విచారణకు ఢిల్లీ వెళితే మంది మార్భలం హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు జైలుకు వెళ్ళినా తెలంగాణ ప్రజలు స్పందించిన దాఖలాలు లేవు.

లోక్ సభ ఎన్నికల ముందు రెండు పార్టీలు వేర్వేరు అనేది ప్రజల్లోకి వెళ్ళకపోతే కష్టమని… ఈ నేపథ్యంలోనే అరెస్టు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో రెండుసార్లు బలి అయింది కవితనే కావటం గమనార్హం. కెసిఆర్ ఎత్తుగడలు వికటించి జరిగిందా.. కాకతాళీయంగా జరిగిందా కాలక్రమంలో బయటపడుతుంది.

బిజెపితో బీఆర్ఎస్ కు ఉన్న తెరవెనుక స్నేహాన్ని ఆసరా చేసుకొని ఎమ్మెల్సీ కవిత కొన్ని తప్పులు చేశారని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర లేదని క్లీన్ చీట్ తో వస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. దీనిపై కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే వారి కుటుంబ సభ్యుల నుంచి.. పార్టీ నేతల వరకు హైరానా పడ్డారు. నెలరోజుల పాటు ఎక్కే గడప.. దిగే గడప అన్నట్టుగా ఢిల్లీ, అమరావతిల మధ్య చక్కర్లు కొట్టారు. అదే కవిత అరెస్టు అయితే కెసిఆర్ బహిరంగంగా ఇంత వరకు మాట్లాడలేదు. కేటిఆర్, హరీష్ రావు మినహా ఎవరు అంతగా స్పందించటం లేదు. ఎన్నికలు ముగిసేలోగా… లేదంటే ఆ తర్వాత ఖచ్చితంగా కవిత బయటకు వస్తారని దీమాతోనా..? విడుదలపై బీఆర్ఎస్ నేతలు మాటలను చూస్తే వారు భరోసాతో ఉన్నారని ద్యోతకం అవుతోంది.

బీఆర్ఎస్ అధినేతకు ఏ పార్టీతో శత్రుత్వం ఉండదు… అలాగని మిత్రుత్వం కూడా ఉండదు. ఎవరితో అవసరం ఉంటే వారితే పాలు నీళ్ళలా కలిసిపోవటం కెసిఆర్ నైజం. ఈ చతురతను ప్రజలు గుర్తించినా తెలంగాణ కోసం ఇదంతా చేస్తున్నాడని హర్షించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ చాణక్య నీతిని కుటుంబ సభ్యుల రాజకీయ ఉన్నతికి వాడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నేతల వలసలను ఆపటం అధినేత వల్ల కావటం లేదు. కే కేశవరావు, కడియం శ్రీహరి వెళ్ళటం పెద్ద షాక్ అని చెప్పవచ్చు. కీలక నేతలు అందరు కాంగ్రెస్ లోకి వెళ్ళటం వేగంగా జరుగుతోంది. కాంగ్రెస్ మీద ప్రేమ కన్నా కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల నియంతృత్వం భరించ లేకనే వెళ్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

పదేళ్ళ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఓ వైపు అయితే… కెసిఆర్ కుటుంబం అభివృద్ధి అనంతమనే భావన ప్రజల్లో నెలకొంది. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దడుతానన్న కెసిఆర్ ఎంత ఉన్నతుడో… కాళేశ్వరం ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు తదితర వ్యవహారాలు అదఃపాతాళానికి తీసుకెళ్ళాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్