Friday, November 22, 2024
HomeTrending Newsశాసనసభ్యుడిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం

శాసనసభ్యుడిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవంబర్‌ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించగా బిజెపి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాక ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ సమయంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కెసిఆర్ పడిపోగా.. తుంటికి గాయమైంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారంలో కెసిఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చాలా రోజుల తర్వాత కెసిఆర్ బయటకు రావటంతో శాసనసభ పరిసరాల్లో సందడి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్