తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటింఛి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకే నేరుగా అయన తెలియజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన కుమార్తె శ్వేత కూడా ఇకపై ఎన్నికల్లో పోటీ చేయరని అయన వెల్లడించారు.
2014 లో మొదటిసారి విజయవాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కేశినేని నాని 2019లో రెండోసారి ఎన్నికయ్యారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీగాలి బలంగా వీచినప్పటికీ విజయవాడలో నాని విజయం సాధించారు. టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు కేశినేని అందించిన సేవలు అయన గెలుపుకు దోహదం చేశాయని చెప్పవచ్చు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేశినేని కుమార్తె శ్వేత ను మేయర్ అభ్యర్ధిగా టిడిపి ప్రకటించింది. ఆమె అభ్యర్ధిత్వాన్ని నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, నాగూల్ మీరా బహిరంగంగా వ్యతిరేకించారు. ఆ సందర్భంలో ఇరు వర్గాల మధ్యా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, బహిరంగ సవాళ్లు జరిగాయి. మొత్తం 64 డివిజన్లలో టిడిపి కేవలం 14 మాత్రమె గెల్చుకుంది. ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో మనస్తాపం చెందిన కేశినేని పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తన కుమార్తె కూడా ఇకపై క్రియాశీలకంగా ఉండే అవకాశం లేదని, ఇప్పటికే ఆమె మళ్ళీ టాటా ట్రస్ట్ కు తిరిగి వెళ్లిపోయారని కేశినేని చెప్పినట్లు తెలిసింది. తాను పార్టీని వీడేది లేదని, తెలుగుదేశంలోనే కొనసాగుతానని అయన స్పష్టం చేశారు.