హాలీవుడ్ నుంచి బాలీవుడ్ .. కోలీవుడ్ .. ఇలా ఎక్కడ చూసినా ‘గ్యాంగ్ స్టర్’ సినిమాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని, డ్రగ్స్ మాఫియా నడుస్తూనే ఉంటుంది. అలాంటి ముఠాలతో పెట్టుకోవడం వలన తన ఫ్యామిలీకి తాను లేకుండా పోతానని తెలిసి కూడా కొంతమంది నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్లు రంగంలోకి దిగుతూనే ఉంటారు. ప్రాణాలకు తెగించి ఆధారాలను సేకరిస్తూనే ఉంటారు. అలాంటి ఒక మాఫియా నేపథ్యంలో నడిచే సినిమాగా ‘కింగ్ ఆఫ్ కొత్త’ నిన్న విడుదలైంది.
దుల్కర్ సల్మాన్ .. ఐశ్వర్య లక్ష్మి .. ప్రసన్న ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ తెలుగు ఆడియన్స్ కి చేరువై చాలా కాలమే అయింది. ఆ మధ్య వచ్చిన ‘సీతారామం’ సినిమాతో ఆయన మరింత దగ్గరయ్యాడు. అందువలన ఇక్కడ కూడా ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమాను భారీ స్థాయిలోనే రిలీజ్ చేశారు. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదనే విషయం మనకి తెలిసిపోతూనే ఉంటుంది.
ఎప్పుడైనా యాక్షన్ కథలలో ఎమోషన్స్ కూడా ఉన్నప్పుడే ఆ యాక్షన్ కి ఒక అర్థం ఉంటుంది. అలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మాఫియా ముఠాతో పోరాటం ఒక వైపు .. స్నేహం – ప్రేమ అనేవి మరొక వైపున చూపిస్తూ వెళ్లారు. అందరూ బాగానే చేశారు .. కాకపోతే ఈ కథలో కనిపించనిదల్లా కొత్తదనమే. అనవసరమైన సీన్స్ .. మరికొన్ని సీన్స్ ను అదే పనిగా సాగదీయడం .. యాక్షన్ సీన్స్ లో లెవెల్స్ దాటేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త అసహనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా టైటిల్ పెద్ద ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.