Friday, September 20, 2024
Homeసినిమాతెలుగు టైటిల్స్ కి దూరంగా ఇతర భాషా చిత్రాలు!

తెలుగు టైటిల్స్ కి దూరంగా ఇతర భాషా చిత్రాలు!

తెలుగు తెరపైకి అనువాద చిత్రాలు రావడం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నదే. అయితే గతంలో ఇతర భాషా చిత్రాలు ఇక్కడ విడుదలైతే, తెలుగులోనే టైటిల్స్ పెట్టేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి పద్ధతికి తెర దింపేశారనే విషయం అర్థమవుతూనే ఉంది. తమిళ .. మలయాళ సినిమాలు  అదే టైటిల్ తో తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ‘విక్రమ్’, ‘జైలర్’ వంటి టైటిల్స్ ను ఇక్కడ మార్చవలసిన  అవసరం లేదు. కానీ ఇక్కడి ప్రేక్షకులకు అర్థం కాని టైటిల్ ను మాత్రం మార్చవలసిందే. కానీ ఈ విషయంలో అలాంటి ప్రయత్నాలేవీ కనిపించడం లేదు.

తమిళంలో ఆ మధ్య అజిత్ చేసిన ‘వలిమై’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. అలాగే సూర్య తమిళంలో చేసిన ‘ఈటి’ అదే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇలాగే ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఎవరూ కూడా తెలుగులో ఆ టైటిల్ కి అర్థం ఏమిటనేది ప్రమోషన్స్ లో కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అదే బాటలో  ఇప్పుడు మలయాళం నుంచి ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే సినిమా వస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా, రేపే థియేటర్లకు రానుంది.

దుల్కర్ ఇక్కడి ప్రేక్షకులకు బాగా పరిచయమే. ‘సీతా రామం’ దగ్గర నుంచి ఆయన ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైపోయాడు. కానీ వచ్చిన సమస్య ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమా టైటిల్ తోనే. ‘కింగ్ ఆఫ్ కొత్త’ అంటే ఏమిటి? అతికించినట్టుగా .. అర్థం లేనట్టుగా అనిపించేలా ఉన్న ఈ టైటిల్ ను మార్చకపోవడం విడ్డూరం. తెలుగు అక్షరాల్లో టైటిల్ పోస్టర్ వచ్చేవరకూ, చాలామంది ఈ టైటిల్ ను ‘కింగ్ ఆఫ్ ఖోత’ అనీ .. ‘కోత’ అనీ .. ‘కోట’ అని రాస్తూ వచ్చారు. టైటిల్ విషయంలో అయోమయమే దీనికి కారణం. కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, ఒక సినిమాను ఆడియన్స్ కి కనెక్ట్ చేసేది టైటిల్ మాత్రమే అనే విషయం మరిచిపోకూడదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్