‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించింది. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న నిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
‘ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజాన్’ పేరుతో ఈరోజు(సెప్టెంబర్ 4న) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. “కిరణ్ ముందుగా నేను నిర్మాతను అని భావించి కథ వినడానికి వచ్చారట కానీ.. కథ విని, బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. ఇప్పుడు పాటలు బాలేకపోతే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు. అందుకే సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను. నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. ‘రంగస్థలం’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు ఆడియో ఎంత హిట్టో, సినిమాలు అంతకు మించిన హిట్ అయ్యాయి. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ కథని నమ్మి నిర్మించడానికి ముందు వచ్చిన నిర్మాతలు దివ్యాంగ్, మురళి అభినందనలు. ఈ సినిమా క్రెడిట్ వారికే దక్కుతుంది. వినోదాత్మక సినిమాలకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “రూల్స్ రంజన్ ప్రయాణం ఏడాది క్రితం మొదలైంది. ఏ.ఎం. రత్నం గారి ద్వారా కృష్ణ గారిని కలిసి ఈ కథ విన్నాను. ఈ కథ వినేటప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. థియేటర్లలో చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారు అనే నమ్మకం ఉంది. నేను మనో రంజన్ అనే పాత్ర పోషించాను. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్ గారికి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ.ఎం. రత్నం గారి సినిమా చూస్తూ పెరిగాను. ఆయన నిర్మించిన సినిమాల్లో ఖుషి ఫేవరేట్ మూవీ. ఏ.ఎం. రత్నం గారు మా సినిమాని సమర్పించడం గర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన దర్శకనిర్మాతలకు, నేహా శెట్టి, ఇతర చిత్ర బృందానికి అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు” అన్నారు.