తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణాజలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం, ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన సమస్యలను సామరస్యంగా తేల్చుకోవాలని, ఘర్షణ వాతావరణం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం తరఫున తమ బాధ్యత నెరవేరుస్తామని హామీ ఇచ్చారు, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో తెలుగు మీడియాతో మాట్లాడారు.
హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయలోనే 370 అధికరణ రద్దు చేసిన రోజు తన జీవితంలో చరిత్రాత్మకమైన, మరచిపోనేని రోజు అని కిషన్ రెడ్డి అభివర్ణించారు. 1980లో బిజెపి కార్యాలయంలో ఓ సామాన్య కార్యకర్తగా తన జీవితం ప్రారంభమైందని, ఈ రోజు కేంద్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి చేరగాలిగానని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇంకా వినమ్రంగా, కష్టపడి పనిచేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, బిజెపి రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి.