Kodali Nani Fire On Bjp Tdp Leaders For Their Comments On Ys Jagan :
బిజెపి నేతల ఉడత ఊపులకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరని, ముఖ్యమంత్రి జగన్ నాడు సోనియాగాంధీనే ఈక ముక్కతో సమానంగా తీసి పారేశారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్ పై మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని రాష్ట్ర బిజెపి నేతలను హెచ్చరించారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై బిజెపి నేతల వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఏడాదిన్నరగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, వారిని కలుసుకునేందుకే అఖిలపక్షం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అఖిలపక్షం ముసుగులో వారితో ఏకాంతంగా మాట్లాడి రాజకీయ పొత్తుల కోసం బేరాలు కుదుర్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ఇటీవలి ఉపఎన్నికల్లో బిజెపిని ప్రజలు పెట్రోలు, డీజిల్ పోసి మంటబెట్టిన విధంగా తీర్పు ఇచ్చారని, మన రాష్ట్రంలోని బద్వేల్ లో బిజెపి పోటీ చేస్తే, జనసేన మద్దతు ఇచ్చిందని, టిడిపి ఎన్నికల ఏజెంట్లను సమకూర్చి సహకరించిందని, మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా రాలేదని, వైసీపీకి 90వేలకు పైగా మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేక ఫలితాలతోనే దిగి వచ్చి పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించారని నాని అన్నారు. 70 రూపాయలు ఉన్న డీజిల్ ను 110 రూపాయలకు పెంచి ఇప్పుడు రూ.10 తగ్గిస్తే ప్రజలు కనికరిస్తారన్న భ్రమలో బిజెపి నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత డీజిల్ మీద పెంచింది ఒక్క రూపాయి మాత్రమేనని, అదికూడా చంద్రబాబు నిర్వాకం వల్లే పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రోడ్లు వేస్తానని 3,500 కోట్లు అప్పు తెచ్చి వాటిని పసుపు కుంకుమ కోసం బాబు వినియోగించారని, ఆ బాకీ కోసమే ఈ సెస్ వేయాల్సి వచ్చిందన్నారు.
పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో ఏటా మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని, వాటిలో రాష్ట్ర వాటా కింద నామమాత్రంగానే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఎక్సైజ్ డ్యూటీ 47 వేల కోట్ల రూపాయలుగా చూపిస్తున్నారని, రాష్ట్రాలకు 15 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని వివరించారు.
ఎవరైనా ధర్నాలు రోడ్ల మీద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చేస్తారని కానీ చంద్రబాబు ఇవాళ పెట్రోల్ బ్యాంకుల దగ్గర ధర్నాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. పెట్రోల్ బ్యాంకులు ప్రైవేట్ స్థలాల్లో ఉంటాయని, అక్కడ ఆందోళనచేసి శాంతి భద్రతల సమస్య తేవాలని ప్రత్నిస్తున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబు 2014లో అమరావతి సర్ ఛార్జీ పేరుతో లీటరుకు 2 రూపాయలు వసూలుచేశారని, ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి తగ్గించారని నాని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదన్న విషయం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియదా అని నాని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినవి రాష్ట్రాన్ని అడుగుతున్నారని, అప్పట్లో ఆత్మా గౌరవ దీక్ష ఢిల్లీ లో చేసినట్లు ఇప్పుడు కూడా చేయాలని సూచించారు.
Also Read : సదరన్ కౌన్సిల్ మీటింగ్ పై సిఎం సమీక్ష