Come to Gudiwada: న్యాయస్థానాలపై అచంచలమైన గౌరవం ఉందని సిఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెబితే, కోర్టులను కించపరిచారని తండ్రీకొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో సమగ్రమైన అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలని, అసమానతలకు తావులేకుండా పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి అభిమతమన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని స్పష్టంగా, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలా సిఎం జగన్ అసెంబ్లీలో చెప్పారని నాని వివరించారు.
శాసన సభకు చట్టాలు చేసే హక్కులు ఉన్నాయని, మా పరిధులు, పరిమితులు ఏంటో మాకు తెలుసని నాని అన్నారు. ఏ వ్యవస్థ అయినా మరో వ్యవస్థలో జోక్యం చేసుకోనంతవరకూ బాగానే ఉంటుందని, అలాకాకుండా జోక్యం చేసుకుంటే అనేక వివాదాలు ఏర్పడి రాష్ట్రం నష్టపోతుందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేరే వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉందని, మూడు రాజధానులు, వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పిన విషయాని నాని గుర్తు చేశారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని లోకేష్‌కు నాని సూచించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్ధుడు లోకేష్ కు, 151మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయిన జగన్ కు ఎక్కడా పోలిక లేదని, ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉందని నాని వ్యాఖ్యానించారు. లోకేష్‌కు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. జగన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. చంద్రబాబు గారు అని సంభోదించారే కానీ, ఎక్కడా ఒక్క మాట తూలలేదన్నారు. ముఖ్యమంత్రిగారిని విమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో ముందుగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
Also Read : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: సభ వాయిదా