తెలుగుదేశం-జనసేన సీట్ల పంపిణీ, అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత టిడిపి కొంప తగలబడుతుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాము తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో తమ పార్టీ మొత్తం అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని.. సీట్లు రానివారు ఐదుగురో ఆరుగురో టిడిపిలో చేరతారని, దానితో తమ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణ, పాలేరు ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టి ఏమి చేసిందో ప్రజలందరూ గమనించారని.. అక్కడ పాదయాత్ర చేసి… ౦.1 శాతం ఉన్న ఆమె పార్టీని ఇక్కడ ౦.1 శాతం ఉన్న పార్టీలో విలీనం చేశారని నాని ఎద్దేవా చేశారు. వైసీపీ కోసం ఆమె కష్టపడి ఉండొచ్చని, ఆమె పాదయాత్ర చేసినప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదన్నారు. 2014-19 మధ్యలో ఆమె పార్టీ కోసం పని చేయలేదని, కానీ ఎన్నికల్లో 20 రోజులపాటు ప్రచారం చేసి రోజుకు రెండు సభల్లో మాట్లాడారని నాని గుర్తు చేశారు.
గత టిడిపి హయంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు ఆమె రాలేదని నాని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పై షర్మిల మోడికి లేఖ రాశారని, తాము ఇలాంటి లేఖలు వంద రాశామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు బాబు తీసుకున్నప్పుడు షర్మిల ఏమైనా మాట్లాడిందా అని నాని ప్రశ్నించారు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలపై జాతీయ స్థాయిలో ఎందుకు పోరాటం చేయడంలేదని నిలదీశారు.
ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని… తెలంగాణాలో ఆయన పేరు మీద పార్టీ పెట్టి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ ఆయన పరువు తీసి చివరకు మూసీనది లాంటి, రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని విమర్శించారు.