చంద్రబాబుకు తన మీద తనకే నమ్మకం లేదని, కొడుకు లోకేష్ మీద అసలు లేదని, అందుకే ఇప్పుడు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను దువ్వుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. పవన్ ఇటీవల మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయాలు ప్రకటిస్తున్నారని, కమ్మవారికి అండగా ఉంటానని చెప్పడం ఆ కోవలోనిదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడే గంగిరెద్దు లాగా పవన్ పరిస్థితి తయారైందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని నడపడం చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లకు చేతకాదని పరోక్షంగా ఒప్పుకున్నట్లయిందని, అందుకే టిడిపిని జనసేనలో విలీనం చేయాలని నాని సూచించారు.
డ్రగ్స్ వ్యవహారంలో తాలిబన్లకు, తాడేపల్లికి లింక్స్ ఉన్నాయంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తూ పలువురిని అదుపులోకి తీసుకుంటుంటే ఇలా లింకులు అంటగట్టడం చూస్తుంటే వారికి మతి లేదని అర్ధమవుతోందని నాని అన్నారు.
సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కులాలు, మతాలకు అతీతంగా పాలిస్తున్నారని అన్నారు. నాడు దివంగత వైఎస్, నేడు జగన్ ఇద్దరూ ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ చెప్పుకుంటే వారి కులం ఆయనకు అండగా ఉంటుందని, కానీ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి నేను పాటుపడతా అంటే అయన సామాజిక వర్గం కూడా ఆయనకు సహకరించే పరిస్థితి ఉండదని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబు కనీసం బద్వేల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా పారిపోయారని, అదే దారిలో పవన్ కళ్యాన్ కూడా వెళ్ళారని, ఇక వారికి అండగా ఎవరైనా ఎందుకు ఉంటారని కొడాలి ప్రశ్నించారు. నీతి, నిజాయితీగా ఉండడం చంద్రబాబు రక్తంలోనే లేవని నాని దుయ్యబట్టారు.