Sunday, January 19, 2025
HomeTrending Newsత్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్

త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కోహెడ పళ్ళ మార్కెట్ నిర్మించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో మాస్టర్‌ లే అవుట్, ఇంజనీరింగ్ డిజైన్స్, ఎస్టిమేట్లకు టెండర్ అప్పగింత తదితర అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులతో చర్చించారు. సోమవారం రెండు లే అవుట్లను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి పలు మార్పులు, చేర్పులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, పర్సన్ ఇంచార్జ్ మరియు అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఇంచార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో రీజినల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నదన్నారు.

178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ను నిర్మించ తలపెట్టిన మార్కెటింగ్ శాఖ, 41.57 ఎకరాల విస్తీర్ణంలో షెడ్ల నిర్మాణం చేపడుతోంది.

39.70 ఎకరాలలో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు రానున్నాయి.

19.71 ఎకరాలలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం

45 ఎకరాలలో రహదారుల నిర్మాణం

24.44 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం

రూ.400 పై చిలుకు కోట్లతో మార్కెట్ ఏర్పాటు

వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్ గావ్)కు మాస్టర్‌ లే అవుట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ను అప్పగించారు. కోహెడ మార్కెట్ స్థలం, బాటసింగారం మార్కెట్ తో పాటు, కొన్ని దేశాలు, దేశంలోని ప్రముఖ మార్కెట్ లు ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబయి), రాజ్ కోట్ మరియు బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లే అవుట్ల నమూనా తయారీ జరిగింది. కంపెనీ నమూనా లే అవుట్లపై ఈ నెలాఖరు వరకు పలుమార్లు చర్చలు జరుగుతాయి.

Also Read టార్గెట్‌ ఇరవై లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్