హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటి పరిశ్రమ విస్తరణ భారీగా జరుగుతుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ చేపట్టిన కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వేలంలో మాత్రం అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలికింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి.
ఈ రోజు ఉదయం నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ఈ ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.