Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇల్లు కొంటున్నారా?

ఇల్లు కొంటున్నారా?

చాలామందికి సొంత ఇల్లు ఒక కల. ఎంత కష్టమైనా జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు. సాఫ్ట్వేర్ కొలువుల పుణ్యమా అని జీవన ప్రమాణాలు అమాంతం పెరిగిపోయి వచ్చే జీతానికి పదిరెట్లు అప్పులు చేసి ఇళ్ళు, కార్లు కొనేస్తున్నారు. అయితే ఎక్కడ కొంటున్నారు? ఎక్కడ పడితే అక్కడ. కొండలు, కోనలు, చెరువులు కబ్జా చేసి కడుతున్న ఇళ్ళు కొనేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. రేప్పొద్దున్న జరగరానిది జరిగి ఆ ఇళ్ళు కూలిపోతే? కుంగిపోతే? లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి వేసే రహదారులే కుంగిపోతున్నాయి. విల్లాలు, అపార్టుమెంట్లు లెక్కా?

మొన్నీమధ్య హైదరాబాద్ నగరంలో కురిసిన వానలకు మునిగిపోయినవిల్లాల విలవిల చూశాం. అపార్టుమెంట్ల ఆవేదన విన్నాం. వీటికి కారణాలు చెరువులు, పొలాలు కబ్జా చేసి కట్టడమే. తాజాగా మీరట్ పట్టణంలో మూడంతస్తుల భవంతి కుంగి, కూలి సుమారు పదిమంది మరణించారు. నిర్మాణమై రెండేళ్లయినా కానీ ఢిల్లీ -ముంబై ఎక్సప్రెస్ వే గుంతలు పడి కుంగింది. ఇది రియల్ (ఎస్టేట్ )కథ.
దీనికి కొనసాగింపుగా ఒక రీల్ కథ – ‘సింక్ హోల్’ చెప్పుకుందాం.

సియోల్ నగరంలో ఒకాయన ఎంతో ముచ్చట పడి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. అదేమీ బహుళ అంతస్తుల భవనం కాదు. మొత్తం ఐదో ఆరో అంతస్తులు. గృహప్రవేశం చేసిన రోజే వాళ్ళబ్బాయి ఆడుకునే బంతి ఏటవాలుగా వెళ్ళింది. దాంతో ఇంటాయనకి సందేహం వచ్చి ఇల్లంతా పరిశీలించి మొత్తం భవనం నిర్మాణం సరిగా లేదని తెలుసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పబోతే వినిపించుకోలేదు. వర్షం నీరు కూడా అపార్ట్మెంట్ లో ఇంకి పోవడం గమనించాడు. ఒకరోజు ఆఫీసువాళ్ళని ఇంటికి పార్టీకి పిలిచాడు. వాళ్లలో ఇద్దరు అతని ఇంట్లోనే పడుకున్నారు. పొద్దున్నే అతని భార్య కొడుకుని తీసుకుని మార్కెట్ కు వెళ్ళింది. ఏదో మర్చిపోతే తేవడానికి కొడుకుని ఇంటికి పంపింది. నీళ్లు రావడం లేదని అదే అపార్ట్మెంట్ లో ఉంటూ అన్ని పనులూ చేసే అతను అపార్ట్మెంట్ పైకి వెళ్లి ట్యాంక్ చెక్ చేస్తాడు. మొక్కలకు నీళ్లు పోస్తున్న పక్కింటి వృద్ధుణ్ణి అడుగుతాడు కూడా. ఆయన మాట్లాడుతుండగానే పెద్ద శబ్దంతో అపార్ట్మెంట్ భూమిలోకి కుంగిపోతుంది. చుట్టుపక్కలవారు అందరూ చూస్తుండగానే సుమారు 500 మీటర్ల లోతుకు దిగబడిపోతుంది. ఇంట్లో పార్టీ ఇచ్చిన వ్యక్తి, అతని ఆఫీస్ సహోద్యోగులు, మరో ఇద్దరు అపార్ట్మెంట్ వాళ్ళు చిక్కుకున్నారు. వారు బయటకు వచ్చారా లేదా? భార్య కళ్ళముందే భవనం కూలిపోతే ఆమె స్పందన, కుమారుడి గురించి తల్లడిల్లే మరో అమ్మ, ఎలాగైనా బతికి బయటపడితే చాలనుకున్న బాధితులు, వారి మానసిక స్థితి, వర్షం పెరుగుతూ అంతకంతకూ భవంతి కురుకుపోతుంటే ఏమీ చెయ్యలేని స్థితిలో అధికారులు … చక్కటి టెంపోతో ఉత్కంఠ రేకెత్తించే కొరియన్ సినిమా ‘సింక్ హోల్ ‘. కొంచెం హాస్యం, విషాదం కలగలసిన చిత్రం. అందరూ అద్భుతంగా నటించారు. పేరుకు కొరియన్ చిత్రమైనా ప్రపంచమంతా ఉన్న సమస్యనే చూపారు. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. కొంచెం అతిగా అనిపించినా చూడాల్సిన చిత్రం.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్