Friday, September 20, 2024
HomeTrending NewsHaritha Haram: 26న కోటి వృక్షార్చన

Haritha Haram: 26న కోటి వృక్షార్చన

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌ను ముగింపు సంద‌ర్భంగా ఈ నెల 26న నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు – ఒక్క‌ కోటి మొక్క‌లు; One Day – One Crore Plantation) ను విజయవంతం చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారుల‌ను ఆదేశించారు. అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా జిల్లాల్లో నిర్ధేశిత ల‌క్ష్యం మేర‌కు మొక్క‌లు నాటేలా చూడాల‌న్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొని మొక్క‌లు నాటాల‌ని కోరారు. విద్యా సంస్థ‌లు, యువ‌త‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారుల‌కు సూచించారు.

కోటి వృక్షార్చ‌న సంద‌ర్భంగా రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను సీయం కేసీఆర్ ప్రారంభించి, మొక్క‌లు నాటుతార‌ని మంత్రి తెలిపారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 360 ఎక‌రాల వీస్తీర్ణంలో ఈ పార్క్ ను అభివృద్ధి చేసింద‌న్నారు.

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుందని పేర్కొన్నారు. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు.

ప్రజల భాగస్వామ్యంతో చేప‌ట్టిన హరిత‌హారం కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 283.82 కోట్ల మొక్క‌లు నాటామ‌ని మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్