రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి హరికేష్ మీనా ఏపి నీటిపారుదల కార్యదర్శికి లేఖ రాశారు. కృష్ణా బోర్డుకు తెలంగాణా ప్రభుత్వం రాసిన ఫిర్యాదు లేఖను కూడా దీనికి జతచేశారు. రాయలసీమ లిఫ్ట ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని గత ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) స్పష్టంగా చెప్పిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది కృష్ణానది నది యాజమాన్య బోర్డ్.
కేఆర్ ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అధ్యయనం చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదని పేర్కొంది.
మరోసారి ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిర్యాదు చేసిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ లు సమర్పించి, ఆమోదం పొందే వరకూ పనులు చేపట్టవద్దని బోర్డు స్పష్టంగా ఆదేశించింది.
కాగా, కేఆర్ ఎంబి లేఖ ఇంకా తమకు అందలేదని, కోవిడ్ నేపధ్యంలోనే నిపుణుల కమిటీ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరామని ఏపి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.