ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వ్యతిరేకి అన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఐటి శాఖమంత్రి కేటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ ని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అని వ్యంగ్యంగా విమర్శించారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పిఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వ పతకం ఎవరిదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత…. దేశ రైతాంగం యొక్క తీవ్ర వ్యతిరేకత వలన క్షమాపణ చెప్పిన వారెవరని కేటీఆర్ అడిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనలో చేరలేదని కెసిఆర్ ని విమర్శిస్తున్న అమిత్ షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో, అదే పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలని, ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా