బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బిజెపి, ఎన్నికల సంఘం మీద సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇంకా చండాలంగా మాట్లాడారు. ఆయన మాటలపై ఫిర్యాదు చేస్తే.. గోడకు చెప్పుకున్నట్టే ఉంది కానీ ఈసీ నుంచి స్పందన లేదన్నారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ప్రధాని మోడీకి, అమిత్ షాకు నోటీసులు జారీ చేయరు. ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులు చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దానికి అనుగుణంగా జరిగిన నియామకాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. చివరకు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. ఇందులో ఎలాంటి రెండో ఆలోచన, అభిప్రాయం తమకు లేదన్నారు. ప్రత్యర్థ పార్టీలను బీజేపీ నాయకులు బండబూతులు తిడుతున్నా.. వాళ్ల బీజేపీ4ఇండియా అఫిషియల్ ట్విట్టర్ ముస్లింలపై విషం చిమ్ముతూ.. ప్రచారం చేస్తున్నా ఒక్క చర్య లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల సంఘం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు జారీ చేసిందన్నారు. మోడీ వ్యాఖ్యలపై నడ్డా జవాబు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తలాతోక లేని నిర్ణయం తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎన్నికల్లో దేవుడిని, మతాన్ని ఇన్‌వాల్వ్ చేయడం నేరం. అమిత్ షా శ్రీరాముడి బొమ్మ పట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, హిందూ ముస్లింలను విడదీసేలా బీజేపీ4ఇండియా దాడి చేసినా ఎన్నికల కమిషన్ మేల్కోవడం లేదన్నారు కేటీఆర్.
అదే కేసీఆర్ విషయానికి వస్తే ఆగమేఘాల మీద నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత భావోద్వేగతంతో కేసీఆర్ ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది లేదు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.. నీళ్లు ఉండి ఇవ్వలేని ప్రభుత్వం ఇది అని కొంత పరుషంగా చెప్పారు. ఆ ఒక్క మాట మాట్లాడేసరికి కేసీఆర్ గొంతు నొక్కారని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేతపై కెసిఆర్ ప్రచారంపై నిషేధంతో ఆ పార్టీ నేతలు వేగంగా స్పందించారు. ఇదే అదునుగా బిజెపి, కాంగ్రెస్ ల మీద విరుచుకుపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు గులాబీ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
-దేశవేని భాస్కర్